ఆనం వివేకా సినిమా కోరిక: చిరు కాదు, బాలయ్య...
నెల్లూరు: కాంగ్రెసు పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారిన మాజీ శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డిని సినిమా చాన్స్ ఊరిస్తోంది. రాజకీయాల్లో ఉంటూనే ఆయన రకరకాల ఫోజులతో, గెటప్‌లతో ఆయన అలరిస్తూ వస్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయనదో ప్రత్యేకమైన స్టైల్. గతంలో చిరంజీవి తన 150వ సినిమాలో వివేకాకు ఓ పాత్ర ఇస్తానని హామీ ఇచ్చారట. కానీ, అది అయ్యేట్లు కనిపించడం లేదు.
ఆ మధ్యలో నెల్లూరుకి చెందిన నిజాముద్దీన్ అనే ఓ నిర్మాత ఆనం వివేకాతో సినిమా తీయాలని భావించారు. అందుకు ఆయనని ఒప్పించారు కూడా. ఆ సినిమాలో వివేకాది న్యాయమూర్తి పాత్ర. తమిళ హీరోలు, ఓ ప్రముఖ హీరోయిన్ కాల్‌షీట్లు కూడా బుక్‌చేశారు. నెల్లూరులోని వి.ఆర్. బి.ఇ.డి కాలేజీ భవనంలో సెట్ వేశారు. ఆ సినిమాలో వివేకాపై ఓ సాంగ్ కూడా పెట్టాలనుకున్నారు.

ఆ పాటతోపాటు మరో నాలుగు పాటల రికార్డింగ్ పనులు కూడా పూర్తిచేశారు. ఆర్టిస్టులు కొందరికి రెమ్యునిరేషన్‌లో కొంతభాగం చెల్లించారు. మరికొందరికి ఖరీదైన కానుకలు ఇచ్చారు. సినిమాకి "క్షమాపణ'' అన్న టైటిల్‌ని ఖరారు చేశారు. అయితే, వివేకాకు సినిమా టైటిల్ నచ్చక పక్కకు జరిగిపోయారట.
కాగా, ఆనం వివేకా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరబోయే ముందు తన ఆనం వివేకానంద రెడ్డి గెటప్ మార్చేశారు. సింహా చిత్రంలో బాలకృష్ణ స్టయిల్లో వొత్తు మీసకట్టుతో కనిపించారు. ఆనం కాంగ్రెస్‌ని వీడారు కాబట్టి చిరంజీవి నూటయాభయ్యవ సినిమాలో ఛాన్స్ ఉండకపోవచ్చునని అంటున్నారు. అందుకే బాలకృష్ణ గెటప్‌లోకి వచ్చేశారు. బాలయ్య త్వరలో తీయబోయే వందవ సినిమాలో ఛాన్స్ కోసమేనేమో సారు ఈ వేషం వేశారు అనుకుంటున్నారు. ఆనం వివేకానంద రెడ్డి కోరిక తీరుతుందో, లేదో చూడాలి.












Click it and Unblock the Notifications