మరో పీఆర్పీ అవుతుందా: పవన్ కళ్యాణ్‌పై జగన్ లెక్క
విజయవాడ: 2019 ఎన్నికల్లో తాను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతానని జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే విషయమై అప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమవుతోంది.
ఓ వైపు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే ఎవరికి నష్టం.. అనే లెక్కలు వేస్తూనే, ఆయన ఎంత మేరకు విజయం సాధిస్తారనే చర్చ కూడా సాగుతోంది. అదే సమయంలో తెలుగుదేశం, బిజెపి ఆయన పైన ఆచితూచి స్పందిస్తున్నాయి. వైసిపి కూడా ఆయన రాకపైన లెక్కలు వేసుకుంటోంది.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే.. తమతో కలుస్తారా? కలవకుంటే తమకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుంది? అనే లెక్కలు టిడిపి అప్పుడే వేసుకుంటోందని తెలుస్తోంది. అలాగే వైసిపి కూడా ఆయన రాక వల్ల లాభనష్టాలను, వస్తే ఏం చేయాలనే విషయమై ఇప్పటి నుంచే చర్చ జరుగుతోందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ నెగ్గేనా?
2019 ఎన్నికల్లో ప్రత్యక్ష బరిలోకి దిగే పవన్ కళ్యాణ్ టిడిపి, వైసిపిలకు ధీటుగా రాణిస్తారా? అనే చర్చ సాగుతోంది. ఏపీలో రాజకీయ శూన్యత లేదని ఇలాంటి సమయంలో ఆయన వచ్చినా లాభం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు. జనసేన మరో పీఆర్పీ అయ్యే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు.

ఇప్పటికే జేపీ వెనక్కి..
రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో ఇటీవలే పవన్ కళ్యాణ్ లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను కలిశారని, రాజకీయ సలహాలు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఏ వైపు రాజకీయాల నుంచి జెపీ నిష్క్రమిస్తుండగా, మరవైపు పవన్ ఆరంగేట్రం చేస్తున్నారని చెప్పవచ్చు. విద్యావంతుడు, మేథావి అయిన జేపీనే రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారని, కేవలం ఇమేజ్ ఉన్నంత మాత్రాన పవన్ ఏ మేరకు నిలదొక్కుకుంటారనే చర్చ సాగుతోంది.

చిరంజీవిలా..
ఇమేజ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవికి చరిష్మా ఎక్కువని, ఆయన కూడా 2009లో 18 సీట్లకు మించి గెలవలేకపోయారని, పవన్ కళ్యాణ్ వస్తే ఏ మేరకు అధికార, విపక్షాలను ధీటుగా ఎదుర్కోగలరనే చర్చ సాగుతోంది.

కాపు రాజకీయం
ప్రస్తుతం కాపుల కోసం ఓ వైపు టిడిపి, మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది రోజులుగా పావులు కదుపుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. ఇదే అదనుగు దీనిని వైసిపి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటే, టిడిపి కౌంటర్ ఇచ్చే పనిలో పడింది. పవన్ బరిలోకి దిగితే ఆ ఓట్లు ఆయనకే పడతాయని చాలామంది భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్
ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకముందే.. పవన్ కళ్యాణ్ తన గెలుపు పైనే అనుమానం వ్యక్తం చేయడాన్ని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. పార్టీ స్థాపించిన పవన్.. తాను కనీసం కార్పోరేటర్‌గా కూడా గెలుస్తానో లేదో తెలియదని చెప్పడం ఏమిటని అంటున్నారు. అంటే తన పైన తనకే నమ్మకం లేనట్లుగా ఉందంటున్నారు.

ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్
1983లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత, రాజకీయ శూన్యత ఉందని, కనీసం 2008లో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు కూడా లేవని అంటున్నారు. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏ మేరకు నెగ్గుకు రాగలరనేది భవిష్యత్తే తేల్చనుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications