ఖాళీ కడుపుతో పండ్ల రసాలు తాగుతున్నారా? మీకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో తెలుసా?
జ్యూస్ అంటే ఇష్టపడనివారుండరు. పండ్లు, కూరగాయల నుండి తీసిన జ్యూస్ ను తాగుతుంటాం. ఇవి రుచికరమైనది మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాలా మంది ఉదయం లేవగానే పరగడుపున పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే, ఇది అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. పరగడుపున పండ్ల రసం తాగడం వల్ల కలిగే లాభాలు, వచ్చే సమస్యల గురించి వివరంగా తెలుసుకుందాం.
పరగడుపున పండ్ల రసం తాగడం వల్ల కలిగే లాభాలు:
పండ్ల రసాలలో విటమిన్లు (విటమిన్ సి, విటమిన్ ఎ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పరగడుపున తీసుకోవడం వల్ల శరీరం వీటిని సులభంగా గ్రహిస్తుంది. పండ్లలో ఉండే సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం పరగడుపున పండ్ల రసం తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పండ్ల రసంలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. కొన్ని పండ్ల రసాలు ( బొప్పాయి రసం) జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

పరగడుపున పండ్ల రసం తాగడం వల్ల వచ్చే సమస్యలు:
అయితే కొన్ని పండ్ల రసాలు ఉదయాన్నే తాగడం వల్ల ఆరోగ్యానికి చేటు చేస్తుంది. సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మ, ద్రాక్ష) వంటివి పరగడుపున తీసుకోవడం వల్ల అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖాళీ కడుపుతో ఆమ్లత్వం ఎక్కువగా ఉండే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, నొప్పి, అసౌకర్యం కలుగుతాయి. పండ్ల రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. పరగడుపున తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, పరగడుపున పండ్ల రసం తాగడం వల్ల శరీరం పోషకాలను సరిగ్గా శోషించుకోలేకపోవచ్చు. పండ్ల రసంలో ఉండే ఆమ్లాలు దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తాయి. కొన్నిసార్లు పరగడుపున పండ్ల రసం తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా కలుషితమైన పండ్ల రసం తాగితే ఇలాంటి సమస్యలు వస్తాయి.
ఏ పండ్ల రసాలు మంచివి?
అన్ని పండ్ల రసాలు పరగడుపున తాగడానికి అనుకూలం కావు. కొన్ని పండ్ల రసాలు ఇతరుల కంటే సురక్షితమైనవి. వాటిల్లో సొరకాయ రసం తీసుకోవడం వల్ల కడుపుని చల్లబరుస్తుంది , అసిడిటీని తగ్గిస్తుంది. పుచ్చకాయ రసం శరీరానికి నీటిని అందిస్తుంది. వేసవిలో చాలా మంచిది. క్యారెట్ రసం విటమిన్ ఎ, ఇతర పోషకాలను అందిస్తుంది.
ఏ పండ్ల రసాలు తాగకూడదు?
సిట్రస్ పండ్ల (నారింజ, నిమ్మ, ద్రాక్ష ) రసాలు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండటం వల్ల అసిడిటీ వచ్చే అవకాశం ఉంది. పైనాఫిల్ రసం కూడా అసిడిక్‌గా ఉంటుంది. కడుపులో మంటను కలిగిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
పరగడుపున పండ్ల రసం తాగడం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి, మీ శరీరాన్ని అర్థం చేసుకొని, సరైన పండ్ల రసాన్ని సరైన మోతాదులో తీసుకోవడం మంచిది. పండ్ల రసంలో నీళ్లు కలపడం వల్ల దాని గాఢత తగ్గుతుంది. అసిడిటీ సమస్యలు తక్కువగా ఉంటాయి. పండ్ల రసానికి బదులు పండ్లను నేరుగా తినడం మంచిది. దీనివల్ల ఫైబర్ కూడా లభిస్తుంది. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, పరగడుపున పండ్ల రసం తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించండి.












Click it and Unblock the Notifications