ఏం గేమ్ రా బై: లాస్ట్ మినిట్ గోల్: నాకౌట్స్ లో బోణీ కొట్టిన చిన్న జట్టు
ఫిఫా వరల్డ్ కప్ మరింత రసవత్తరంగా మారింది. ఈ టోర్నమెంట్ రౌండ్ ఆఫ్ 32లో ఎంట్రీ ఇచ్చింది. నాకౌట్స్ లో ప్రవేశించింది. మొదటి మ్యాచ్ బోణీ కూడా అయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కెనడా ఘన విజయాన్ని అందుకుంది. రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ ముగిసే చివరి క్షణాల వరకు ఇరు జట్లూ గోల్ కొట్టేందుకు తీవ్రంగా శ్రమించాయి.
ఆట ముగిసే అదనపు సమయంలో కెనడా అద్భుతమైన గోల్‌తో సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్టీఫెన్ యుస్టాకియో సాధించిన ఈ ఏకైక గోల్‌తో కెనడా 1-0 తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఎక్కువ సమయం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు చేయలేదు. సుమారు 58 శాతం బాల్ పొసెషన్‌తో మైదానంలో ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, ఆ ఆధిక్యాన్ని గోల్స్‌గా మార్చుకోవడంలో బాఫానా బాఫానా ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.

కెనడా డిఫెన్స్ ను ఛేదించడంలో దక్షిణాఫ్రికా స్ట్రైకర్లు సరైన ప్రణాళికలు అమలు చేయలేకపోయారు. మరోవైపు కెనడా జట్టు మైదానంలో తక్కువ సమయం అంటే 42 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ కౌంటర్ అటాక్‌లతో ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచింది. ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. కెనడా ఆటగాళ్లు మ్యాచ్ మొత్తం మీద 14 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా, అందులో ఏడు షాట్లు నేరుగా టార్గెట్ వైపు దూసుకెళ్లాయి. ఇదే దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్‌పై పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చింది.
ద్వితీయార్థంలో ఇరు జట్ల కోచ్‌లు వ్యూహాత్మక మార్పులు చేశారు. దక్షిణాఫ్రికా జట్టు రీలీబోహిలే మోఫోకెంగ్, థాలెంటె ఎంబాతా వంటి యువ ఆటగాళ్లను బరిలోకి దించింది. అలాగే కెనడా కూడా అల్ఫోన్సో డేవిస్, తాజోన్ బుకానన్‌లను మైదానంలోకి దించి తమ దాడులను మరింత ఉధృతం చేసింది. ఈ సబ్‌స్టిట్యూషన్ ప్లేయర్ల రాక తర్వాత మ్యాచ్ స్వరూపం మారింది. దక్షిణాఫ్రికా మరింత దూకుడుగా వ్యవహరించినా చివరకు కెనడానే పైచేయి సాధించింది.
మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావిస్తోన్న తరుణంలో.. అనూహ్యంగా కెనడా గోల్ సాధించింది. ఆట ముగియడానికి మరో కొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉండగా, 90+2 నిమిషానికి కెనడియన్ మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ యుస్టాకియో తనకు లభించిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎంతో చాకచక్యంగా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపి, కెనడాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రౌండ్ ఆఫ్ 16లో అడుగు పెట్టిన మొదటి జట్టయింది కెనడా.












Click it and Unblock the Notifications