41 డిగ్రీల సెగ.. 1300 మంది మృతి!
ప్రకృతి ప్రకోపానికి ఐరోపా ఖండం విలవిలలాడుతోంది. జూన్ 21 నుంచి మొదలైన భీకరమైన వడగాల్పులు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ప్రాణనష్టాన్ని, విధ్వంసాన్ని మిగిల్చాయి. సాధారణంగా ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచే ఐరోపా దేశాలు, ఇప్పుడు సూర్యుడి ప్రతాపానికి నిప్పుల కొలిమిలా మారాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు దాదాపు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ అత్యంత వేడి వాతావరణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్.. సైలెంట్ కిల్లర్ గా అభివర్ణించారు. ప్రపంచ సగటుతో పోలిస్తే ఐరోపా ఖండం రెండింతల వేగంతో వేడెక్కుతోందని, ఇది మానవాళికి పెను సవాలుగా మారిందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పాతకాలపు కట్టడాలు, గృహాలు, పాఠశాలలు ఇటువంటి తీవ్రమైన వేడిని తట్టుకునేలా నిర్మించకపోవడంతో, లోపల ఉన్న ప్రజలు వేడికి చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడ సాధారణ రోజుల కంటే అదనంగా 1,000 మరణాలు నమోదైనట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. మరణించిన వారిలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులే ఎక్కువగా ఉండటం విషాదకరం.

జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో 41.7°C, చెక్ రిపబ్లిక్‌లోని డోక్సానీలో 41.1°C, పోలాండ్‌లోని స్లుబిస్‌లో 40.5°C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేడిని తట్టుకోలేక ఈత కొట్టేందుకు నదులు, చెరువుల్లో దిగిన వారిలో 74 మంది నీటిలో మునిగి మరణించడం అక్కడి భయానక వాతావరణానికి అద్దం పడుతోంది. ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగి పవర్ గ్రిడ్లు విఫలమవుతున్నాయి. నెదర్లాండ్స్‌లో జరగాల్సిన భారీ మ్యూజికల్ ఈవెంట్ 'డెఫ్‌కాన్.1'ను అధికారులు రద్దు చేయగా, పారిస్‌లో బహిరంగ కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు.
శాస్త్రవేత్తలు ఈ విపత్తుకు "హీట్ డోమ్" (Heat Dome) అనే వాతావరణ అసాధారణతను ప్రధాన కారణమని గుర్తించారు. వాతావరణంలో ఏర్పడే అధిక పీడనం వల్ల వేడి గాలి పైకి వెళ్లలేక భూమికి దగ్గరగానే బంధి అవతుంది. ఇది ఆ ప్రాంతాన్ని తట్టుకోలేని వేడికి గురి చేస్తోంది. ఒకప్పుడు అరుదుగా సంభవించే ఇటువంటి విపత్తులు, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇప్పుడు ప్రతి ఏటా ముంచుకొస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే ఈ వినాశనానికి మూలమని, తక్షణమే ఐరోపా దేశాలు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని ముప్పులు తప్పవని ఈ విపత్తు స్పష్టం చేస్తోంది.














Click it and Unblock the Notifications