గోంగూర తింటున్నారా? అయితే ఈ రోగాలు మాయం!!
ప్రతిరోజు మనం తినే ఆకుకూరలు కూరగాయల్లో మన ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని గుర్తించి వాటిని తినడమే ప్రధానం. అటువంటి పోషకాలు ఉన్న ఆకుకూరల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోంగూర. రుచికి పుల్లగానే ఉన్నప్పటికీ గోంగూర తింటే మీ జీవితంలో మీ ఆరోగ్యం గురించి తీపి కబురు చెబుతుంది అని చెబుతున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
గోంగూరలో పోషకాలు, ఔషధ గుణాలు
గోంగూరతో చేసే వంటకాలు చాలా ప్రత్యేకం. గోంగూరతో ఏ వంట చేసినా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో దేశవాళీ గోగు, పుల్ల గోగు అని రకాలు ఉంటాయి. గోంగూరలో క్యాల్షియం, ఇనుము, విటమిన్-ఎ, విటమిన్ సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్‌యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, పీచు ఎక్కువగా ఉంటుంది. ఇలా గోంగూరలో పలు ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

గోంగూరతో ఆరోగ్య ప్రయోజనాలు
గోంగూరను తరచుగా ఆహారంలో భాగంగా చేసుకుంటే మన శరీరానికి కావలసిన విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. కనీసం వారంలో రెండు సార్లు అయినా గోంగూర తింటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతే కాదు గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. గోంగూర లో ఉండే పొటాషియం, మెగ్నీషియం హైబీపీని తగ్గిస్తాయి.
లివర్ హెల్త్ కోసం గోంగూర
మన లివర్ హెల్త్ ను కాపాడే అద్భుతమైన గుణాలు గోంగూరలో ఉన్నాయి. గోంగూరని వేసి నీళ్లను మరిగించి ఆ గోంగూర నీటిని తాగడం వల్ల లివర్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లివర్ డిటాక్సిఫై అవుతుంది.
గాయాలు, గడ్డలపైన గోంగూర ఆకును ఆముదంతో నూరి, వెచ్చగా చేసి వేస్తే త్వరగా తగ్గిపోతాయని చెబుతున్నారు.
గోంగూరతో ఈ సమస్యలకు చెక్
రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవటం, రేచీకటిలాంటి సమస్యలతో బాధపడేవారు గోంగూర వాడితే మంచి ఫలితం ఉంటుంది. విరోచనాలు అధికంగా అవుతుంటే కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి, తాగితే ఫలితముంటుంది. మిరపకాయలు వేయకుండా ఉప్పులో ఊరవేసిన గోంగూరను అన్నంతో తిన్నా విరోచనాలు తగ్గిపోతాయి.
ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన గుణాలున్న గోంగూర
దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవారు గోంగూరను ఆహారంలో తీసుకుంటే ఉపశమనం ఉంటుంది. శరీరంలో నీరు చేరినప్పుడు గోంగూర మేలు చేస్తుంది. అయితే అధిక ఉష్ణ శరీరతత్వం ఉన్నవారు గోంగూరను మితంగా తింటేనే మంచిదనీ ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్న గోంగూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం మర్చిపోకండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications