తమలపాకు అన్నం: ఘాటుగా, స్పైసీగా ఇలా చేస్తే మెతుకు కూడా వదిలిపెట్టరు!
తమలపాకు కేవలం పూజలకు, తాంబూలానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా రాత్రి వండిన అన్నం మిగిలిపోతే ఏం చేయాలో పాలుపోక చాలామంది పారేస్తుంటారు. అలా కాకుండా, మిగిలిన అన్నంతో కేవలం 10 నిమిషాలలో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తమలపాకు అన్నం తయారు చేసుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ హెల్తీ రైస్ రెసిపీ తయారీ విధానం చూద్దాం.
కావలసిన పదార్థాలు:
మిగిలిన అన్నం (లేదా వండిన అన్నం) – 2 కప్పులు
తమలపాకులు – 3 లేదా 4 (లేతవి)
పచ్చిమిర్చి – 2
అల్లం ముక్క – చిన్నది
జీలకర్ర – 1 టీస్పూన్
మిరియాలు – అర టీస్పూన్
పోపు దినుసులు (ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు) – 1 టేబుల్ స్పూన్
పల్లీలు లేదా జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి – 2
కరివేపాకు – ఒక రెమ్మ
నెయ్యి లేదా నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 స్పూన్

తయారీ విధానం:
ముందుగా తమలపాకులను శుభ్రంగా కడిగి, వాటి వెనుక ఉండే లావుపాటి ఈనెలను తీసేయాలి. ఆ తర్వాత తమలపాకులను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో ఈ తమలపాకు ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర, మిరియాలు మరియు కొంచెం నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తమలపాకు అన్నం తయారీకి ఇలా చెయ్యాలి
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి వేయించాలి. పోపు కాస్త వేగాక అందులో పల్లీలు లేదా జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత, మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తమలపాకు పేస్ట్‌ను ఇందులో వేయాలి.
ఇలా చేస్తే తమలపాకు రైస్ కు రుచి వస్తుంది
పచ్చి వాసన పోయేంత వరకు చిన్న మంట మీద 2-3 నిమిషాల పాటు బాగా వేయించాలి. తమలపాకు మిశ్రమం దగ్గరపడి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. మసాలా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు అన్నాన్ని పాన్ లో వేయాలి.
హెల్తీ తమలపాకు అన్నం ఇలా చేస్తే సూపర్ టేస్ట్
మసాలా మొత్తం అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద ఒక నిమిషం పాటు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.చివరగా పైనుంచి ఒక చెంచా నిమ్మరసం పిండుకుని బాగా కలిపితే ఎంతో ఘాటుగా, రుచిగా ఉండే హెల్తీ తమలపాకు అన్నం సిద్ధం. దీనిని ఏదైనా రైతాతో లేదా ఊరగాయతో తింటే అద్భుతంగా ఉంటుంది.













Click it and Unblock the Notifications