రాబోయే 8 నెలలు రాష్ట్రంలో తీవ్ర సంక్షోభం: సీఎం రేవంత్ సంచలన వార్నింగ్
ఎల్ నినో ప్రభావం కారణంగా రానున్న 8 నెలల్లో తెలంగాణలో తీవ్ర సంక్షోభం పొంచి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వార్నింగ్ ఇచ్చారు. వచ్చే జూన్ వరకు తాగు, సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కోవిడ్ తరహాలో ఎల్ నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేలా కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో విద్యుత్ ఆధారిత పనులను తాత్కాలికంగా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగా గుర్తించకపోతే భవిష్యత్ లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
ఎల్ నినో, కరువు ప్రభావాలను ఎదుర్కొనేందుకు వచ్చే 8 నెలల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని.. చేతికొచ్చే దశలో ఉన్న పంటలకు నీటి భద్రత కల్పించాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. రానున్న 8 నెలల్లో విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కరెంట్ ను పొదుపుగా వినియోగించాలని, సాధ్యమైన చోట విద్యుత్ అధికంగా అవసరమయ్యే కార్యకలాపాలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, కరువు పరిస్థితులు నెలకొన్న 215 మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ. 20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరడంతో పాటు, VB-G RAM G పథకం కింద ప్రస్తుతం ఉన్న 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజులు కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రుల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎప్పటికపుడు పరిస్థితులను సమీక్షించేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications
