అమెరికాలో భీకర కాల్పులు.. 9 మందిని చంపి సూసైడ్ చేసుకున్న గన్ మెన్..
అమెరికాలోని పెన్నిసెల్వానియా ప్రావిన్స్ లోని ఏరీ ప్రాంతంలో కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. ఈ కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ గర్భిణి, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులకు తెగబడిన గన్ మెన్ 9 మందిని చంపి అనంతరం తనను తాను కాల్చుకుని సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన అక్టోబర్ 9న సాయంత్రం 5 గంటల సమయంలో పెర్రీ స్ట్రీట్ లోని 700 బ్లాక్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనను ఏరీ న్యూస్, కేబీటీఎక్స్ న్యూస్ 3 మీడియా సంస్థలు ధ్రువీకరించాయి. గన్ తో ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన దుండగుడు ముందుగా ఇంటి ముందు ఉన్న ఇద్దరు మహిళల్ని కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంట్లోని వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
ఇక ఈ ఘటనపై ఏరీ పోలీస్ చీఫ్ రిక్ లోరా మాట్లాడూతూ.. ఇలాంటి ఘటనను తన సర్వీస్ లో చూడలేదని తెలిపారు. ఈ ఘటన హార్ట్ బ్రేకింగ్ గా ఉందని దర్యాప్తు చేసే అధికారులు, పోలీసులు తెలిపినట్లు వివరించారు. ఇలాంటి ఘటన జరిగి ఉండకూడదని లోరా రిపోర్టర్స్ తో తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. నిందితుడు- బాధితులకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తునకు కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. అయితే అధికారులు ఇప్పటి వరకూ మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.

ఇక ఏరీ పట్టణం ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉందని. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఏరీ ప్రభుత్వ యంత్రంగం ఈ ఘటనపై ఫేస్ బుక్ ద్వారా పోస్టు పెట్టింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. పోలీస్ యంత్రాంగంతో కలిసి ఈ ఘటనపై పనిచేస్తున్నామని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications
