షుగరు ఉన్నవారు తినాల్సిన మెనూ ఇదే
ఈరోజున అందరూ భయపడుతున్న, అందరినీ భయపెడుతున్న వ్యాధి ఏదైనా ఉందా? అంటే.. అది మధుమేహం ఒక్కటే. మనిషిని పూర్తిగా చావనీయకుండా.. అలాగని మంచి ఆరోగ్యంగా బతకనీయకుండా చేస్తుంది. ఏది తిందామన్నా శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయోననే అనుమానంతో ఏదీ తినలేని పరిస్థితి. మరోవైపు ఆకలి నకనకలాడిపోతుంటుంది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మధుమేహ బాధితుల పరిస్థితి ఉంటుంది. తినకుండా ఉండటం కోసం డైట్ పాటిస్తారు.. తద్వారా నీరసానికి గురవుతారు.
కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడంతో షుగరును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. బచ్చలికూర, బ్రోకలీ, క్యాబేజీ, గ్రీన్ బీన్స్, చింతచిగురు, మునగాకు వండి ఆహారంగా తీసుకోవాలి. వీటిల్లో కార్బొహైడ్రేట్స్ ఉండవు. ఉదయం వేళ అల్పాహారంగా ఓ గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్, ఆరు నానబెట్టిన పొట్టు తీసిన బాదం గింజలు, ఉడకబెట్టిన గుడ్డు ఒకటి తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు గుడ్డులో పచ్చ సొన లేకుండా ఉంటే మంచిది.

అలాగే మధ్యాహ్నం భోజనానికి కరగాయల్ని కడిగి ముక్కలుగా చేసి వాటిని వేడి నీళ్లల్లో ఓ పది నిముషాలు ఉంచాలి. తర్వాత అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. రాత్రివేళ భోజనానికి ఓ చపాతీతోపాటు గిన్నెడు కూర తీసుకోవాలి. మధ్యలో ఏవైనా తినాలనిపిస్తే మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలతో చేసినవాటిని తీసుకోవచ్చు. వీటితోపాటు వైద్యులను సంప్రదించి వారు చెప్పిన ప్రకారం కూడా డైట్ పాటిస్తే షుగరు ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటారు.












Click it and Unblock the Notifications