health tips: ఎంత తిన్నా మళ్ళీ ఆకలేస్తుందా.. అయితే కారణాలివే కావచ్చు!!
చాలామందికి కడుపునిండా తిన్న కూడా మళ్లీ ఆకలవుతుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అయితే ఇది చాలా సాధారణమైన లక్షణం అని చాలా మంది భావిస్తారు. కానీ అలా ఎప్పటికీ పదేపదే ఆకలి అవుతుంది అంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉండొచ్చని చెబుతున్నారు వైద్యులు.
తరచుగా ఆకలి కావడం, పదేపదే తినడం బరువు పెరగడానికి కారణం అవుతుంది. అనేక ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. అసలు తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక వాటిని గురించి చెప్పాలంటే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా మంది కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి, కానీ నిద్రపోరు.

ప్రతిరోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుందని చెబుతున్నారు. నిద్ర సరిగ్గా లేనప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలి పెరుగుదలను సూచిస్తుంది అని, ఫలితంగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అని చెబుతున్నారు. అందుకే ఆకలి సమస్య లేకుండా ఉండాలి అంటే రోజూ ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి.
ఇక డయాబెటిస్ ఉన్న వారిలో కూడా అధికంగా ఆకలి అవుతుంది అని చెబుతున్నారు. గ్లూకోజ్ డయాబెటిస్ రోగుల శరీరానికి కావలసిన పోషకాలను ఇవ్వదని, ఇది శక్తి గా మారడానికి బదులు మూత్ర రూపంలో బయటకు వచ్చేస్తుంది అని అంటున్నారు. ఫలితంగా డయాబెటిస్ బాధితులకు అధికంగా ఆకలి అవుతుందని చెబుతున్నారు.
ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి కూడా అధికంగా ఆకలి అవుతుందని చెబుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ స్థాయి పెరిగినపుడు హైపర్ థైరాయిడిజమ్ వస్తుంది. ఈ స్థితిలో వారు ఎంత తిన్నా కడుపు ఖాళీగానే ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. ఫలితంగా ఏదైనా తినాలనే కోరిక వారికి పదేపదే కలుగుతుంది.
ఒత్తిడి కూడా ఆకలికి కారణమౌతుంది. అధిక ఒత్తిడి శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ను పెంచుతుంది. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు కూడా విపరీతంగా ఆకలి కావడానికి కారణంగా మారుతుంది. అంతేకాదు ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే కూడా పదేపదే ఆకలవుతుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం తిన్న తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తే మీరు తినే ఆహారంలో కచ్చితంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకునేలా చూసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications