తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా ఒబెసిటీ స్ధాయిలు ? ఐసీఎంఆర్-నిన్ షాకింగ్ రిపోర్ట్ !
మారుతున్న జీవనశైలి కారణంగా ఊబకాయం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. అయితే ఇది కూడా ఇప్పుడు ప్రమాదకర స్ధాయికి చేరిపోతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఊబకాయులపై ఐసీఎంఆర్, జాతీయ పౌష్ణికాహార సంస్ధ (ఎన్ఐఎన్)జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఊబకాయం స్ధాయిలు ప్రమాదకరంగా ఉన్నట్లు ఇందులో తేలింది.
ఐసీఎంఆర్-నిన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పట్ణణ, గ్రామీణ ప్రాంతాలన్నింటిలోనూ జనంలో ఊబకాయం ప్రమాదకర స్ధాయిలో ఉన్నట్లు తేలింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనంలో వివిధ వయోవర్గాల్లో పెరుగుతున్న ఊబకాయం స్ధాయిలు, వాటికి గల కారణాలు బయటపడ్డాయి.హైదరాబాద్ తో పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలోని నాలుగు గ్రామాల్లోని 10,350 మంది వ్యక్తులను శాస్త్రవేత్తలు పరిశీలించారు.

ఇందులో తెలంగాణలోని పట్టణ పెద్దలలో 47.7 శాతం మంది ఊబకాయంతో, 14.8 శాతం మంది అధిక బరువుతో ఉన్నారని ఈ అధ్యయనం తేల్చింది. అదేవిధంగా ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 46.7 శాతం మంది పెద్దలు ఊబకాయంతో బాధపడుతున్నట్లు తేలింది . అలాగే 14.8 శాతం మంది అధిక బరువుతో ఉన్నారు. వృద్ధుల్లోనూ పట్టణ ప్రాంతాల్లో 50.6 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 33.2 శాతం ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనం తెలిపింది.
అలాగే పట్టణ ప్రాంతాల్లో 11 శాతం మంది , గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. అయితే రెండు ప్రాంతాలలో 5 శాతం మందికి పైగా చక్కెర వ్యాధి ఉంది. ముఖ్యంగా 40-59 సంవత్సరాల వయస్సు గల పెద్దలు, క్లరికల్/స్కిల్డ్/సెమీ-స్కిల్డ్ వృత్తులలో నిమగ్నమై ఉన్నవారు, ఇతరులతో పోలిస్తే ఊబకాయంలో ఎక్కువ తేడాలతో ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయనం చేసిన వారిలో 8,317 మంది హైదరాబాద్‌లో నివసిస్తుండగా, 2,033 మంది ఏపీలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం విశేషం.












Click it and Unblock the Notifications