కేరళ కులుక్కి షర్బత్.. అద్భుతః
ప్రజలు తమ దాహార్తిని తీర్చుకోవడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సహజసిద్ధమైన పానీయాలను ఆశ్రయించడం ఆనవాయితీ. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ స్టైల్ కులుక్కి షర్బత్ ట్రై చెయ్యొచ్చు. కేరళ ఆరిజిన్ అయిన ఈ డ్రింక్.. వివిధ ప్రాంతాలలో విపరీతంగా ప్రాచుర్యం పొందుతోంది.
కాస్త కారం, మరి కాస్త తీపి, ఇంకొంచె పులుపు.. కలగలిసిన దీని ప్రత్యేక రుచి సాధారణ జ్యూస్‌ల కంటే భిన్నంగా ఉంటోంది. ఈ రుచికరమైన పానీయాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో, దాని ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.

కులుక్కి షర్బత్ ఆరోగ్య ప్రయోజనాలు:
1. శరీర వేడిని తగ్గిస్తుంది: కులుక్కి షర్బత్‌లో సబ్జా గింజలు చాలా కీలకమైన భాగం. ఇవి సహజసిద్ధంగా శరీరాన్ని చల్లబరిచే ఏజెంట్‌గా పనిచేస్తాయి. వేసవిలో వచ్చే శరీర వేడి, మూత్రపిండాల మంట వంటి సమస్యలకు ఇవి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
2. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది: ఎండలో తిరిగేటప్పుడు చెమట రూపంలో శరీరం నుండి నీరు, ఖనిజ లవణాలు కోల్పోవడం సహజం. నిమ్మరసం, పంచదార కలిసిన ఈ పానీయం శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తక్షణమే భర్తీ చేసి, శరీరానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఇందులో కలిపే నిమ్మరసం, స్వల్ప పచ్చిమిర్చి కారం లాలాజలాన్ని ప్రేరేపించి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. వేసవిలో తరచుగా ఎదురయ్యే ఆకలి మందగించడం, అజీర్తి సమస్యలకు ఇది మంచి పరిష్కారం.
సాధారణంగా దుకాణాలలో షర్బత్‌లో షుగర్ సిరప్ ఎక్కువగా వాడతారు. కాబట్టి మధుమేహులు, బరువు తగ్గాలని కోరుకునే వారు, పంచదారకు బదులుగా తేనె లేదా బెల్లం పొడి / తాటి బెల్లం వంటివి ఉపయోగించి ఇంట్లోనే ఆరోగ్యకరమైన రీతిలో దీన్ని తయారు చేసుకొని తాగవచ్చు. కృత్రిమ శీతల పానీయాలకు దూరంగా ఉండి, శరీరానికి చలువ, ఆరోగ్యం అందించే ఈ సంప్రదాయ 'కులుక్కి షర్బత్'ను ఇంట్లోనే తయారుచేసి, వేడి నుండి ఉపశమనం పొందవచ్చు.
కులక్కి సర్బత్ తయారీకి కావలసినవి:
- సబ్జా గింజలు - 1 టీస్పూన్ (10 నిమిషాలు నీటిలో నానబెట్టాలి)
- నిమ్మకాయ - 1 (సగం రసం పిండాలి, సగం ముక్కలుగా కోయాలి)
- పచ్చిమిర్చి - 1 (చివర్ల వద్ద తేలికగా చీరినది)
- పంచదార లేదా తేనె - 2 నుండి 3 టేబుల్‌స్పూన్లు (రుచికి సరిపడా)
- ఐస్ ముక్కలు - తగినంత
- నీరు - 1 పెద్ద గ్లాస్
- ఉప్పు - ఒక చిటికెడు
తయారుచేసే విధానం:
ముందుగా, సబ్జా గింజలను కొద్దిపాటి నీటిలో పది నిమిషాలు నానబెట్టాలి. అవి బాగా ఉబ్బి జెల్లీలా మారతాయి. ఆ తర్వాత, మూత ఉన్న పెద్ద జార్ లేదా ప్లాస్టిక్ షేకర్ తీసుకోవాలి. ఇప్పుడు, నానబెట్టిన సబ్జా గింజలు, సగం నిమ్మకాయ రసం, తేలికగా చీరిన పచ్చిమిర్చి, ఒక చిటికెడు ఉప్పు, పంచదార (లేదా తేనె) అందులో వేయాలి. మిగిలిన నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోసి జార్‌లో వేయడం ద్వారా షర్బత్‌కు అదనపు సువాసన వస్తుంది.
జార్‌లో తగినన్ని ఐస్ ముక్కలు, చల్లని నీరు పోసి మూతను గట్టిగా బిగించాలి. జార్‌ను పట్టుకుని, సుమారు 10 నుండి 15 సార్లు వేగంగా పైకి, కిందకి బాగా కుదపాలి. ఈ ప్రక్రియ వల్లనే దీనికి 'కులుక్కి షర్బత్' అనే పేరు వచ్చింది. ఇలా బాగా కుదపడం వల్ల పచ్చిమిర్చిలోని స్వల్ప కారం, నిమ్మకాయ పులుపు, పంచదార తీపి కలిసి ఒక సరికొత్త రుచిని అందిస్తాయి. ఆ తర్వాత, ఈ పానీయాన్ని గ్లాస్‌లో పోసి వెంటనే సర్వ్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications