OneIndia Exclusive: మోడీ-షా ప్లే బుక్ వ్యూహం- బయటపెట్టిన టీఎంసీ ఎంపీ..!
దేశంలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘంలో తలెత్తిన భిన్నాభిప్రాయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు అధికార బీజేపీ వ్యవహారశైలిపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా (Mahua Moitra) తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై ఆమె నిన్న ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఆమె వన్ ఇండియా హిందీతో (OneIndia Exclusive) ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు.
సీఈసీపై మహువా మొయిత్రా ఫిర్యాదు (Mahua Moitra)
ఎన్నికల సంఘంలోని తోటి కమిషనర్ల ఆమోదం లేకుండానే ఓటర్ల జాబితాల మార్పులు, ఫారమ్-6 వంటి కీలకమైన అంశాలపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఆరోపించారు. గత పది నెలల కాలంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి పలు వివాదాస్పద ప్రతిపాదనలపై లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను లేవనెత్తారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఎన్నికల సంఘం వర్గాలు గట్టిగా తోసిపుచ్చాయి. కమిషన్ తీసుకునే నిర్ణయాలన్నీ పూర్తి ఏకగ్రీవంగానే జరుగుతాయని, సభ్యుల చర్చల్లో అంతర్గత అభ్యంతరాలు సహజమని ఈసీ వివరణ ఇచ్చింది.

మోదీ-షా ప్లేబుక్ వ్యూహం
సీఈసీ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సాగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న మహువా మోయిత్రా, కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న వారిని మొదట సురక్షితంగా కాపాడటం, ఆ తర్వాత ప్రజల నిరసనలను అణచివేయడానికి పోలీసు బలగాలను రంగంలోకి దించడం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహమని ఆమె ఆరోపించారు. దీనిని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయానికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్లేబుక్‌గా ఆమె అభివర్ణించారు. శాంతియుత మార్గంలో సాగే నిరసనలపై ఇలాంటి చర్యలకు దిగడం హేయమని మండిపడ్డారు.

ఇక అణచివేత అసాధ్యం
ఎస్ఐర్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకల వల్ల దేశవ్యాప్తంగా సామాన్య పౌరుల పవిత్రమైన ఓటు హక్కు తీవ్ర ప్రమాదంలో పడిందని మహువా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల నుంచి వస్తున్న ఈ వ్యతిరేక గళం ఇప్పుడు మరింత బలంగా మారిందని, దీనిని అణచివేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఈ పోరాటం కేవలం తమ పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే పరిమితం కాలేదని, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడను కాపాడేందుకేనని ఆమె స్పష్టం చేశారు. మహువా మోయిత్రా ఆరోపణలు, విమర్శలపై అధికార బీజేపీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. అయితే, దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం విశ్వసనీయతపై విపక్షాలు ఈ స్థాయిలో సవాళ్లు విసరడం, న్యాయపోరాటానికి సిద్ధమవడం దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.














Click it and Unblock the Notifications
