ఏపీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో కీలక మార్పు..! సర్కార్ ఆదేశాలు..!
ఏపీలో ప్రస్తుతం ప్రభుత్వ విభాగాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఉద్యోగాలు, ఇతర అవసరాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. గతంలో దశాబ్దాలుగా జారీ చేసిన మ్యాన్యువల్ సర్టిఫికెట్లను ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంపికలు, సంక్షేమ పథకాల కోసం చేసే వెరిఫికేషన్ కూడా మ్యాన్యువల్ విధానంలోనే సాగుతోంది. దీని వల్ల ఆలస్యం పెరిగిపోవడంతో పాటు తప్పులు కూడా దొర్లుతున్నాయి. అనర్హులు కూడా ఏదో ఒక సర్టిఫికెట్ తీసుకొచ్చి ఉద్యోగాలు, పథకాలు కొల్లగొట్టేస్తున్నారు. తీరా తప్పు తెలుసుకునే సరికి పుణ్యకాలం గడిచిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం (AP Govt) ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
గత కొంతకాలంగా అన్ని సర్టిఫికెట్లు కూడా డిజిటల్ విధానంలోనే జారీ చేయడం ప్రారంభించారు. కాబట్టి ఇకపై ఆయా సర్టిఫికెట్లను కూడా డిజిటల్ గా మాత్రమే వెరిఫై చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన డిజీ వెరిఫై (DigiVerify) ప్లాట్ ఫారంను వాడుకోవాలని తెలిపింది. వీటితోనే విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వం నుంచి పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

ఇలా డిజిటల్ విధానంలో సర్టిఫికెట్ల ధృవీకరణ చేయడం వల్ల ఫిజికల్ కాపీల అవసరం తగ్గిపోతుందని, ప్రభుత్వ వెబ్ సైట్ లోనే నేరుగా చూసేందుకు అవకాశం కలుగుతుందని సీఎస్ సాయి ప్రసాద్ తెలిపారు. దీని వల్ల అనవసరంగా వెరిఫికేషన్ జాప్యం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసే అన్ని సర్టిఫికెట్లను ఇకపై ప్రభుత్వ విభాగాలు డిజి వెరిఫై ప్లాట్ ఫారం ద్వారానే ధృవీకరించాల్సి ఉంటుందని, ఇందులో లేని సర్టిఫికెట్లకు మాత్రమే మ్యాన్యువల్ గా వెరిఫై చేసేందుకు అనుమతి ఇస్తామని సీఎస్ వెల్లడించారు. తాజాగా డీఎస్సీలో స్పోర్ట్స్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ లో తలెత్తిన ఇబ్బందులు కూడా ప్రభుత్వం తాజా నిర్ణయానికి ఓ కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా ఇకపై సర్టిఫికెట్ల డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా ఆలస్యం, ఇతర ఇబ్బందులు మాత్రం తగ్గబోతుండటం ఊరట కలిగించే అంశం.














Click it and Unblock the Notifications
