మీసేవా కేంద్రాలకు వెళ్ళకుండా ఇంటికే ప్రభుత్వ సర్టిఫికెట్లు.. శుభవార్త!
తెలంగాణలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఒక కీలక అడుగు వేసింది తెలంగాణా ప్రభుత్వం. ఇప్పటివరకు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతూ గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ.. 'మీ ఇంటికే.. మీ సేవలు' మీసేవ డోర్ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో ఈ సరికొత్త సేవలను అధికారికంగా ప్రారంభించారు. తొలి దశలో క్యూర్ పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా గతంలో ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కుల, ఆదాయ, జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాలు కావాలంటే ఉదయాన్నే మీసేవ కేంద్రాల వద్ద బారులు తీరాల్సి వచ్చేది.

దీంతో సమయం, డబ్బు వృథా అయ్యేవి. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఉద్యోగులు పనులు మానుకుని మరీ కేంద్రాల వద్ద వేచి చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతలు మీసేవ కేంద్రాలకు నడిచి వెళ్లడం ఎంతో ఇబ్బందికరంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో దళారుల ప్రమేయంతో అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం తాజాగా తెచ్చిన ఈ డోర్ డెలివరీ విధానం ద్వారా ప్రజలకు ఎంతో ఊరట లభించనుంది.
ప్రజలు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి లేదా అధికారిక మీసేవ పోర్టల్ ద్వారా తమకు నచ్చిన సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ నేరుగా మీ ఇంటికి వచ్చి దరఖాస్తు స్వీకరించి, సేవలు అందిస్తారు. ముఖ్యంగా కేంద్రాలకు రాలేని వృద్ధులు, ఉద్యోగులు, దివ్యాంగులు, మహిళలు, గర్భిణులు, చిన్నారులకు ఈ సేవలు ఒక వరంలా మారనున్నాయి.
ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన సేవలైన జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణలు, ఆధార్, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇక ఇంటి వద్దే లభిస్తాయి. త్వరలో 'పహాణీ' సేవలను కూడా దీనికి అనుసంధానించనున్నారు. ఈ సేవలను పకడ్బందీగా అందించేందుకు ఇప్పటికే 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లకు, వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలు ఇక ఇంట్లోనే కూర్చుని అవసరమైన సర్టిఫికెట్లు పొందవచ్చు.













Click it and Unblock the Notifications
