డబ్బు కోసం నాని సినిమాలు చేయరు... ది ప్యారడైజ్ స్టార్‌పై హీరోయిన్ ప్రశంసలు
ది ప్యారడైజ్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు నేచురల్ స్టార్ నాని. రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. చివరికి సెప్టెంబర్ 24న ది ప్యారడైజ్ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. తొలిరోజే వరల్డ్ వైడ్‌గా 88 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమా. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నాని ఈ సినిమాను తన భుజాలపై మోస్తున్నారు. సినిమాపై విమర్శలు వచ్చినా నాని నటనను, ఆయన కష్టాన్ని మాత్రం ప్రశంసిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి స్టారో హీరో వరకు ఎదిగి ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నారు నాని. కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నాని పనిచేశారు. ఈ క్రమంలోనే నానిపై ప్రశంసలు కురిపించారు ప్రియాంక మోహన్. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన ప్రియాంక మోహన్.. తొలుత కన్నడంలోనే ఒంద కథ హెల్లాతో హీరోయిన్గా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో తన మొదటి సినిమా నానితోనే కావడం విశేషం. అదే గ్యాంగ్ లీడర్... అనంతరం కొంతకాలానికి సరిపోదా శనివారం సినిమాతో మరోసారి నానితో జత కలిశారు ప్రియాంక. కోలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశం దక్కడంతో అక్కడ బిజీ అయ్యారు. ఈ దశలో తెలుగులో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ప్రియాంక. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీలో కన్మణిగా, పవన్‌కు భార్యగా అద్భుతంగా నటించారు.

తర్వాత మేడ్ ఇన్ కొరియా అని సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ రేంజ్‌కి దూసుకెళ్లారు ప్రియాంక మోహన్. ప్రస్తుతం తమిళంలో మంజనాత్తి, ఏజీఎస్ 29తో పాటు కావిన్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. దీనితో పాటు తన మాతృభాష కన్నడంలో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్లో చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఓజీ అంతటి బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ తెలుగులో ప్రియాంకకు అవకాశాలు రావడం లేదు. అయితే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ మూవీలో హీరోయిన్గా ప్రియాంకను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలాఉండగా.. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నానిపై ప్రశంసలు కురిపించారు ప్రియాంక. మన ఆలోచనా విధానం, ప్రవర్తన సరిగా ఉంటే ప్రజలు మన వెంటే ఉంటారు. నా దృష్టిలో నిజమైన విజయం అంటే ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడమే. కేవలం ప్రతిభ, కఠోర శ్రమ, నిజాయితీ, తోటి నటీనటులు, సహచరుల పట్ల చూపే గౌరవం ద్వారా నాని ఈ స్థాయికి చేరుకున్నారు. అదే ఆయనను నిజమైన స్టార్‌గా నిలబెట్టిందని ప్రియాంక చెప్పారు.
కేవలం డబ్బు సంపాదించడం కోసమే నాని సినిమాలు చేయరు.. సినిమాపై ప్యాషన్‌తో వైవిధ్యమైన స్క్రిప్ట్‌లు ఎంచుకుంటాడు. నా తొలి చిత్రం నానితోనే కావడం నా అదృష్టం. షూటింగ్ సమయంలో నాని నాకు అండగా నిలిచారు.. నాకు సౌకర్యవంతంగా ఉండేలా చేయడం వల్లే కొత్త అమ్మాయిని అన్న ఫీలింగ్ అనిపించలేదు. నానికి సినిమాలంటే పిచ్చి.. విరామ సమయంలోనూ తన పాత్ర ఏంటీ? ఇంకా బెటర్మెంట్ కోసం ఆలోచిస్తుంటాడు. రెండో సినిమా వచ్చేసరికి క్లోజ్ అయ్యాడు.. ఆయనతో అన్ని విషయాలను షేర్ చేసుకుంటానని ప్రియాంక మోహన్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
