పోషకాల రాగి లడ్డు.. సింపుల్ గా టేస్టీలా ఇలా చెయ్యండి!
ప్రస్తుతం ఆహార విషయంలో చాలామంది చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఏది ఆరోగ్యానికి మంచిది ఏది మంచిది కాదు అనే విషయాన్ని అర్థం చేసుకుని తింటున్నారు. ముఖ్యంగా చిరు తిండి విషయంలో కూడా ఆరోగ్యానికి హాని చేయని పదార్థాలను ఎంచుకొని తింటున్నారు. ఇక అటువంటి వాటిలో ఆరోగ్యానికి రాగి లడ్డు అమృతం లాంటిది. క్యాల్షియం పుష్కలంగా ఉండేది రాగి లడ్డు. ప్రస్తుతం ఈ రాగి లడ్డులను ఇళ్లల్లో తయారు చేసుకొని తింటున్నారు.
పోషకాలతో కూడిన రాగి లడ్డులు
జీవనశైలి వ్యాధులతో బాధపడేవారు శరీరానికి కావలసిన బలం కోసం ఈ రాగి లడ్డులను చేసుకొని తింటున్న పరిస్థితి ఉంది. ఎటువంటి పాకం పట్టే అవసరం లేకుండా ఎంతో రుచికరమైన పోషకాలతో కూడిన రాగి లడ్డులు ఎలా తయారుచేయాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

రాగి లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి: ఒక కప్పు
బెల్లం తురుము: 3/4 కప్పు
నెయ్యి: నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు
డ్రై ఫ్రూట్స్: జీడిపప్పు, బాదం, కిస్మిస్ రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: అర టీ స్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై అదే పాన్ లో రాగి పిండిని మరికొంత నెయ్యి వేసి మాడిపోకుండా సిమ్ లో పెట్టి కలుపుతూ మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంటను పూర్తిగా చిన్న సెగ పైన పెట్టి కలుపుతూ వేయించి పక్కన పెట్టుకోవాలి.
లడ్డూ ఇలా చేస్తే బాగుంటుంది
అందులో బెల్లం తురుమును, యాలుకల పొడిని, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ ను కలుపుకోవాలి. వేడికి బెల్లం కొద్దిగా పిండికి పట్టుకుంటుంది. ఆపైన మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పి తిరిగి గిన్నెలోకి తీసుకొని అందులో కాస్త నెయ్యి వేస్తూ లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టడానికి రాకపోతే కాస్త నెయ్యి పిండిలో కలిపి ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది.
రాగి లడ్డులతో శరీరానికి కావాల్సిన పోషకాలు
ఈ రాగి లడ్డులు తినడం వల్ల మన శరీరానికి కావలసిన క్యాల్షియం వస్తుంది. శరీరానికి కావలసిన ఐరన్ సమృద్ధిగా దొరుకుతుంది బరువు నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి స్నాక్. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినాలి అనుకుంటే రాగి లడ్డూలు ఒకసారి ట్రై చేయండి.












Click it and Unblock the Notifications