ఈ టేస్టీ టేస్టీ "తోటకూర దోసెలు" ఎప్పుడైనా తిన్నారా ?

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం దోసె. బియ్యం, మినప్పప్పు కలిపి నానబెట్టి, రుబ్బి, పులియబెట్టిన పిండితో దీనిని తయారు చేస్తారు. ప్లెయిన్ దోసెలతో పాటు వివిధ రాష్ట్రాల్లో దోసెను రకరకాలుగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం పెసరట్టు.. ఇది బియ్యానికి బదులు పెసరపప్పుతో చేస్తారు. దీనిని అల్లం పచ్చడి, ఉప్మాతో కలిపి తింటే ఆ రుచే వేరు. కర్ణాటకలో నీర్ దోసె చాలా ఫేమస్. అలాగే సెట్ దోసెలు చిన్నగా, స్పాంజిలా ఉండి ఒకేసారి మూడు ఇస్తారు. తమిళనాడులో వివిధ రకాల పప్పు ధాన్యాలతో చేసే అడై చాలా పోషకవిలువలు కలిగిన బలమైన వంటకం.

అయితే ఎప్పుడైనా దోసెలను తోటకూరతో చేసిన దోశలు ప్రయత్నించారా? లేదంటే ఈసారి తప్పకుండా ట్రై చేయాల్సిందే. పెసరపప్పు, తోటకూరల కలయికలో తయారయ్యే దోసెలు చాలా టేస్టీగా ఉంటాయి. తోటకూర ఇష్టం లేని పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. తక్కువ సమయంలోనే రెగ్యులర్ దోసెల కంటే భిన్నమైన ఈ వెరైటీ దోసెలను ఎలా చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

totakura-dosa-making-recipe-in-telugu

కావాల్సిన పదార్థాలు..

పెసరపప్పు - 1.5 కప్పులు

తోటకూర - 2 కట్టలు

అల్లం - 2 అంగుళాల ముక్క

పచ్చిమిర్చి - 4-5

జీలకర్ర - 2 స్పూన్లు

బియ్యప్పిండి - 1 కప్పు

వాము - 2 చెంచాలు

ఉప్పు - రుచికి తగినంత

నూనె - దోశలు వేయడానికి సరిపడా.

తయారీ విధానం..

పిండి తయారీ :

ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఆపై, లేత తోటకూరను తీసుకుని వేరు భాగాన్ని తీసివేసి, మిగతా భాగాన్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అనంతరం, నానిన పెసరపప్పును నీరు లేకుండా వడకట్టి, దానిని కట్ చేసుకున్న తోటకూర ముక్కలతో పాటు వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తుంపలు, జీలకర్ర, బియ్యప్పిండి వేసుకుని ఒకసారి అంతా బాగా కలపాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో తోటకూర మిశ్రమాన్ని విడతల వారీగా వేసుకుంటూ, అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు కలిపి, దోశకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న మిశ్రమం మొత్తాన్ని ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, వాముని చేతితో నలిపి వేసి, మిశ్రమం అంతా బాగా కలిసేలా చూసుకుని పక్కన ఉంచాలి. ఇది దోశలు వేయడానికి సిద్ధం.

దోసెలు వేసే పద్దతి :

తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి వస్త్రంతో తుడిచి, కలిపి పెట్టుకున్న పిండిని ఒకటి లేదా రెండు గరిటెలు వేసి దోశలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి.

దోశపై కొద్దిగా నూనె వేసుకుని ఒక వైపు మంచిగా కాలాక, రెండో వైపు తిప్పి లైట్​గా కాల్చుకోవాలి. అప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే అప్పటికప్పుడు రెడీ అయ్యే సూపర్ టేస్టీ తోటకూర దోశలు సిద్ధం.

మరి, నచ్చితే మీరు ఎప్పుడూ చేసుకునే మినప్పప్పు దోశలకు బదులుగా, ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఒకటికి రెండు చాలా ఇష్టంగా తింటారు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+