• search
  • Live TV
keyboard_backspace

చరిత్ర: పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు..నేలమాళిగల్లో ఉన్న నిధులేంటి..?

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం వివాదంకు సుప్రీం కోర్టు ఎట్టకేలకు తెరదించింది. ఈ ఆలయంపై హక్కులు ఎవరు కలిగి ఉంటారో అన్నదానిపై దశాబ్దకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు సుప్రీంకోర్టు తెరదించింది. అనంత పద్మనాభస్వామి ఆలయం, పరిపాలనపై సర్వ హక్కులూ ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అప్పగించింది. ఆలయ పరిపాలన, నిర్వహణపై పూర్తి హక్కుదారులు ట్రావెన్‌కోర్ రాజ వంశీయులేనని తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అంతులేని ధనరాశులు, గుప్త నిధులు ఉన్నట్లుగా భావిస్తోన్న నేలమాళిగలోని ఆరో గది తలుపులను తెరవాలా.. వద్దా.. అనే విషయంపై తుది నిర్ణయాన్ని తీసుకునే హక్కు ట్రావెన్‌కోర్ రాజ వంశీయులకు ఉందని స్పష్టం చేసింది.

తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచం ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా గుర్తింపు పొందిందిం. ఈ ఆలయంలోని నేలమాళిగలో అనంత ధనరాశులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఆలయ చరిత్ర ఒక్కసారి పరిశీలిద్దాం. 8వ శతాబ్దంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయ ఆకారంను మాత్రం 18వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్ మహారాజా మార్తాండ వర్మ నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం ప్రత్యేకమైన చేరా శైలిలో జరిగింది. ఇక్కడ విష్ణుమూర్తిని పూజిస్తారు. అనంతశయన భంగిమలో ఆదిశేషుడిపై విష్ణుమూర్తి కనిపిస్తాడు. భారత్‌లో ఉన్న 108 వైష్ణవ ఆలయాల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఒకటిగా ఉంది.

History of Padmanabhaswamy temple, its treasuries and conflicts

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ ఆలయ బాగోగులను నిర్వహణను ట్రావెన్‌కోర్ వంశీయులకు చెందిన ట్రస్టు చూసుకునేది. ట్రావెన్‌కోర్ వంశానికి చెందిన చివరి వాడైన చితిర తిరునాల్ బలరామ వర్మ 1991లో మరణించడంతో ఈ ఆలయ నిర్వహణ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆయన మరణం తర్వాత కూడా ఆ వంశానికే సర్వహక్కులను కట్టబెడుతూ నాటి కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆలయ నిర్వహణ బాధ్యతలను బలరామవర్మ సోదరుడైన ఉత్రదమ్ తిరునాల్ మార్తాండ వర్మకు అప్పగించింది. అనంత పద్మనాభ స్వామి ఆలయం నిర్వహణ బాధ్యతలను ట్రావెన్‌కోర్ కుటుంబ సభ్యులు నిర్వహించరాదని కేరళ హైకోర్టు 2011లో తీర్పు వెల్లడించింది. ఇప్పుడు ఇదే తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆలయ నిర్వహణ సర్వహక్కులు ట్రావెన్‌కోర్ రాజవంశీయులకే చెందుతాయని పేర్కొంది.

అయితే దశాబ్దకాలంగా వార్తల్లో నిలుస్తున్న ఈ పద్మనాభ స్వామి ఆలయం చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం త్రిమూర్తులను సూచిస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు. పద్మనాభ స్వామిని వెతుక్కుంటూ విల్వమంగళతు స్వామియార్ అనే సన్యాసి ప్రపంచాన్ని పర్యటించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలోనే విష్ణువు 18 అడుగుల మేరా తగ్గి ఆదిశేషుడిపై పడుకున్న భంగిమలో ఉన్నట్లుగా విల్వమంగళతు స్వామియార్‌కు దర్శనం కలిగింది. ఇదిలా ఉంటే ఆ విగ్రహం కందశరకారతో తయారు అయ్యిందని రాజవంశీయులు చెప్పారు. అంటే మూలికలు, జిగురు పదార్ధాలు, మట్టితో తయారు చేయబడిందని వివరించారు. ముందుగా ఈ ఆలయంను చెక్కతో నిర్మించారు. అనంతరం గ్రానైట్ వినియోగించి నిర్మించారు. ఈ రోజు ఉన్న ఆలయం గ్రానైట్ నిర్మాణంతో ఉన్నదే. ఈ ఆలయంలో 365 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం ఒక్కో రోజును సూచిస్తుంది.

ఇక ఆలయంలోని ప్రధాన విగ్రహం తయారీకోసం 12,500 సాలీగ్రామ రాళ్లను నేపాల్‌లోని గందకీ నది తీరం నుంచి తరలించారు. సాలీగ్రాములు చాలా పవిత్రమైన రాళ్లు. వీటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రాళ్లకు విష్ణువుకు అనుబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయం కింద మొత్తం ఆరు నేలమాళిగలు ఉన్నాయి. ఈ నేలమాళిగల్లో బంగారం, వజ్రా వైఢూర్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేలమాళిగలను తెరవాలన్న దగ్గర నుంచే వివాదం మొదలై కోర్టుల వరకు వెళ్లింది. 2017లో నేలమాళిగలను తెరిచి అందులోని ఆభరణాలు, బంగారం వజ్ర వైఢూర్యాల విలువ లెక్కగట్టాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు గోపాల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో రెండు నేలమాళిగలు 130 ఏళ్లుగా తెరవలేదు. మొదటి నేలమాళిగను తెరవగా లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే నిధులు వెలుగు చూశాయి. ఇక సుబ్రహ్మణ్యం గోపాల్ నేలమాళిగల్లో ఏమున్నాయో ప్రతి అంశాన్ని తన నివేదికలో పొందుపర్చారు. అందులో నెపోలియన్, రోమ్, మధ్యభారత యుగం, బ్రిటీష్ కాలం నాటి బంగారు నాణేలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నాణేలు ఉన్న సంచుల బరువు 800 కిలోల వరకు ఉన్నట్లు పొందుపర్చారు.

అంతేకాదు ఈ కమిటీ కొన్ని బంగారంతో చేసిన కుండలు, కుర్చీలను కూడా కనుగొంది. ఇక 4 బై 3 అడుగుల గల విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది. దీన్ని వజ్రాలు ఇతర ఖరీదైన మెటల్స్‌తో తయారు చేశారు. ఈ విగ్రహంను కూర్చోబెట్టేందుకు 28 అడుగుల బంగారు పీఠం ఆ నేలమాళిగలో దొరికింది. ఇంకా విగ్రహంకు తొడిగేందుకు బంగారంతో అలంకరించిన బట్టలు కూడా లభించాయి. ఇక ట్రావెన్ కోర్ కుటుంబం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2011లో ఉత్రదామ్ తిరునాల్ మార్తాండ వర్మ వారి వంశం గురించి చెప్పారు. దేశంలో ఉన్న రాజకుటుంబాల్లో ఒక కుటుంబం తమదని చెప్పారు. 1870లో అయ్యన్ అడిగల్ తిరువడీర్‌తో ట్రావెన్‌కోర్ వంశం ప్రారంభమైంది. తమకు పద్మనాభ స్వామితో ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆలయంలోకి వెళ్లేముందు ఎలాంటి పాదరక్షలు ధరించమని భగవంతుడిని దర్శించుకున్న తర్వాత కూడా కాళ్లను శుభ్రపరుచుకుంటామని చెప్పారు. అంటే ఒక్క ఇసుక రేణువు కూడా తమ వెంట తీసుకెళ్లకుండా జాగ్రత్తపడతామని చెప్పారు. ఆలయంలో ఇసుక రేణువుతో సహా ప్రతి వస్తువు విష్ణుమూర్తికే చెందుతుందని చెప్పారు. 1950లో రాజకిరీటాన్ని పద్మనాభ స్వామికి అంకితం చేశారు. దీంతో ఇకపై పద్మనాభ స్వామి తమకు రాజని తామంత ఆయనకు సేవ చేసుకునే సేవకులమని ప్రకటించడం జరిగింది.

English summary
The Supreme Court Monday ended a nearly decade-old legal dispute, by upholding the rights of the erstwhile royal family of Travancore to manage the affairs of the Sree Padmanabhaswamy Temple in Thiruvananthapuram.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X