చిన్నిగాడా, మజాకా...
నీవు లేక నిదుర రాదు అన్నాడతను.
నువ్వు లేకుంటేనే నాకు నిద్ర వస్తుంది అంది భార్య.
రేపు గోంగూరు పచ్చడి చేయి ఆదేశించాడు అతను.
పుంటి కూర తొక్కు చేస్తా అంది ఆమె.
నీకసలు బుద్ధి లేదు అన్నాడతను.
నీకు ఉంటే ఎదుటివాళ్లకు ఉందో లేదో తెలుస్తుంది అంది ఆమె. ఆంధ్రాతెలంగాణ వివాదంలా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తూనే ఉంది.
ఆ వివాదం రగులుతుండగానే హిప్ హిప్ హుర్రే అంటూ అరిచాడు పదేళ్ల చిన్నిగాడు.
బెడ్రూంలోంచి కొడుకు టీవీ చూస్తున్న సిట్టింగ్ రూంలోకి వచ్చారు గబగబా వచ్చారు భార్యాభర్తలిద్దరు.
ఏమిట్రా, రాయలసీమవాడిలా అరుస్తావు అన్నాడు తండ్రి.
మధ్యన వాడెందుకు కసురుకుంది భార్య.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మాకూ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు - చెప్పాడతను.
తెలివి తెల్లారినట్లే ఉంది - అంది
తెలివి అస్తమించకూడదా అన్నాడతను
అస్తమించడమేమిటి, నీ బొంద, పొద్దీకింది అనాలి - అంది.
గొప్ప ఐడియా అరిచాడు చిన్నిగాడు. ఆ ఆరుపునకు భార్యాభర్తలిద్దరికీ గుండెలు గుభేలుమన్నంత పనై పోయింది. తెలంగాణ, కోస్తా వివాదంలోకి ఇంగ్లీషు ఇంత సులభంగా ప్రవేశిస్తుందేమిటని వారు ఆశ్చర్యపడ్డారు. కానీ, ఎవరూ బయట పడలేదు.
నీ ఐడియా ఏమిటో చెప్పేడువు అని అడిగింది ఆమె చిన్నిగాడిని.
చెప్తే చాలు, ఏడుపెందుకు. వాడు ఏడ్పు మొదలు పెట్టాడంటే తీసుకెళ్లి కంప్యూటర్ గేమ్ ఆడించాల్సి వస్తుంది. అన్నాడు భార్యనుద్దేశించి.
చాల్లే. తెలివి ఏడ్చినట్లే ఉంది అంది ఆమె.
తెలివి నవ్వినట్లుండకూడదేమిటి అన్నాడతను.
ఇండియా, పాక్ మధ్య కార్గిల్ వార్‌లాగా మీ మధ్య ఈ వార్ ఏమిటి అన్నాడు చిన్నిగాడు.
అమెరికాలాగా నీ జోక్యం ఏమిటని అడిగాడు అతను
పూర్ డాడీ, నీకు ఐడియాకు మీనింగ్ తెలిసినట్లు లేదే అన్నాడు చిన్నిగాడు.
చిన్నబుచ్చుకున్నాడతను. నోటీకి అరచేయి అడ్డం పెట్టుకుని ముసిముసిగా నవ్వింది ఆమె.
నా ముద్దులు చిన్నారీ, నీ ఐడియా ఏమిట్రా, నాయనా అని అడిగిందామె.
నీ కొమ్ము కాశాడనా, వాడ్ని ముద్దు చేస్తున్నావు అన్నాడు భర్త కోపంగా.
కాయడానికి నీకు కొమ్ములున్నాయనా నీ ఉద్దేశం అంది ముక్కు చీదుకుంటూ భార్య.
ఏడ్వకే నా రాణి ఏడ్వకే అన్నాడు అతను.
డాడీ, మమ్మీ అని గట్టిగా అరిచాడు చిన్నిగాడు.
ఏమిట్రా నీ అల్లరి అన్నాడతను కొడుకునుద్దేశించి
నా ఐడియా చెప్పమంటారా, వద్దంటారా అన్నాడు చిన్ని.
చెప్పు, నాయనా అంది ఆమె.
నీ వాలకం చూస్తుంటే వాడి చేత నా మీద ఏదో రాయి వేయించేట్లున్నావు అన్నాడతను.
అనుమానం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టినట్లున్నారు అంది ఆమె మూతి వంకర్లు తిప్పుతూ.
మీరు విన్నా సరే, వినకున్నా సరే నా డెసిషన్ చెప్పేస్తున్నా అన్నాడు చిన్ని.
ఇంతకు ముందు ఐడియా అన్నావు, ఇప్పుడు నిర్ణయమంటావేమిట్రా అడిగాడు తండ్రి.
మీ పొట్టాట వల్ల ఐడియా కాస్తా డెసిషన్‌గా మారిపోయింది అన్నాడు వాడు.
చెప్పరా, నాయనా అడిగింది ఆమె.
నేను స్ట్రయిక్ చేయబోతున్నా, ఇండిఫినెట్ స్ట్రయిక్ ప్రకటించాడు చిన్ని.
డిమాండ్లేమిటి అడిగాడు తండ్రి
ఓన్లీ వన్ డిమాండ్. ఎప్పుడూ కొట్లాడుకునే మీరు నా మమ్మీడాడీలుగా రిజైన్ చేయండి, కొత్త మమ్మీడాడీలను తెండి అన్నాడు
భార్యాభర్తలిద్దరు నోళ్లు వెళ్లబెట్టారు.












Click it and Unblock the Notifications