టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి గృహోపకరణాల విషయంలో మీరు వాస్తు పాటిస్తున్నారా? చెక్ చేసుకోండి!!
కొత్త టీవీ కొని సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే పాడైపోయింది. మొన్ననే కొత్త రిఫ్రిజిరేటర్ తీసుకున్నాం.. ఇంతలోనే రిపేర్ వచ్చింది. ఐదేళ్ల వారెంటీ అన్నారు.. రెండు ఏళ్ళు కాకముందే ఏసీ పాడైపోయింది.. ఇలా చాలామంది ఇంట్లో త్వరగా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడై పోతున్నాయి అని కంప్లైంట్ చెబుతూ ఉంటారు.
ఇంట్లో వస్తువుల రిపేర్ వస్తే తద్వారా డబ్బు వృధా అవుతుంది. పదే పదే రిపేర్లు రావడం వల్ల మానసికంగా చిరాకు కలుగుతుంది. అయితే వారంతా ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంట్లో పెట్టుకునేటప్పుడు వాస్తు పాటించకపోవడం వల్లనే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చాలామంది ఇంట్లో సౌకర్యాన్ని బట్టి వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. తరచుగా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడై పోతున్నాయని బాధపడేవారు, ఇంట్లో ప్రతికూల ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు మనం గృహోపకరణాలను ఇంట్లో పెట్టుకునే విషయంలో వాస్తు నియమాలను గురించి తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మనం ఎయిర్ కండిషనర్, ఫ్రిజ్, టీవీ లను ఏ దిశలో పెట్టుకుంటే వాస్తుకు అనుకూలంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎయిర్ కండిషనర్ ను తప్పు దిశగా పెట్టుకోవడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇది మన మనసును,ఆరోగ్యాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. అంతేకాదు ఆర్థికంగానూ నష్టాన్ని చేకూరుస్తుంది. వాస్తు ప్రకారం ఎయిర్ కండిషనర్లు ఉత్తరం లేదా పడమర దిశలో ఉండాలి. అలా ఉంటేనే సానుకూల ఫలితాలను ఇస్తాయి.
ఇక కూలర్ ను కూడా ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఈశాన్యం, వాయువ్యం లేదా తూర్పు దిశలో పెట్టుకోవాలి. ఎయిర్ కండిషనర్ ను పశ్చిమ దిశల్లో పెట్టినట్టు, కూలర్లను పశ్చిమ దిశలో పొరపాటున కూడా పెట్టకూడదు. వంటింట్లో ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టడానికి ఆగ్నేయ దిశ అనుకూలమైన ప్రదేశం. ఇక రిఫ్రిజిరేటర్ లను దక్షిణం, పశ్చిమం, ఆగ్నేయం లేదా ఉత్తరం దిశలలో ఉంచడం మంచిది.
వాస్తు ప్రకారం టెలివిజన్ లను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. ఇంట్లో డెస్క్ టాప్ లు, ల్యాప్ టాప్ లు పెట్టడానికి కూడా ఉత్తమమైన దిశ ఆగ్నేయ దిశ మాత్రమే. కాబట్టి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు రాకుండా ఉంటాయి. వస్తువులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయి.












Click it and Unblock the Notifications