చాతుర్మాసంలో శివుడే సృష్టి సంరక్షకుడు.. శివయ్య అనుగ్రహం కోసం చెయ్యండిలా!!
ఆషాఢ మాసంలోని దేవ శయని ఏకాదశి తిధి నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అయితే చాతుర్మాసంలో శ్రీమహావిష్ణువుతో పాటు పరమ శివుణ్ణి పూజిస్తే ఎంతో మేలు జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా శివుడిని పూజిస్తే భక్తవ శంకరుడు, బోలా శంకరుడు అయిన పరమశివుడు కరుణాకటాక్షాలు పుష్కలంగా మనపైన ఉంటాయని చెప్తారు.
అసలు చాతుర్మాసం లో శివుడిని ఎందుకు పూజించాలి.. అంటే చాతుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటే, సృష్టిని సంరక్షించే బాధ్యత పరమశివుడు తీసుకుంటాడు. అందుకే ఈ సమయంలో శివారాధన చేయడం మంచిదని చెబుతారు. చాతుర్మాసం లోనే శ్రావణమాసం కూడా వస్తుంది కాబట్టి ఈ మాసంలో శివుడిని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతున్నారు.

చాతుర్మాసంలో శివుడి కరుణ మనపై ఉండాలంటే ఎటువంటి ప్రతికూల ఫలితాలు రాకుండా ఉండటం కోసం కొన్ని చేయవలసిన పరిహారాలు సూచిస్తున్నారు పండితులు. చాతుర్మాసం లో దేవాలయంలో కర్పూరాన్ని విరాళంగా సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం, ప్రశాంతత మరియు సమృద్ధి కలుగుతుందని చెబుతున్నారు. శివుడి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు.
చాతుర్మాసంలో శివుడి దయ కోసం నిరుపేదలకు బెల్లం దానం చేస్తే మంచిదని, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి ఉంటుందని చెబుతున్నారు. ఈ నెలలో ఆహారాన్ని దానం చేయడం ఎంతో మంచిదని, అన్నదానం చేయడం వల్ల పుణ్యగతులు కలుగుతాయి అని చెబుతున్నారు. అంతేకాదు ఆవులకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల సంపద నష్టం జరగదని, ఆర్థిక లాభాలు చేకూరుతాయని, రుణ బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు.
గోవుల సంరక్షణ వల్ల దేవతలకు ఆనందం కలుగుతుందని, పితృ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. గొడుగు, పాదరక్షలు, ఆహారాన్ని దానం చేయడం వల్ల ఆ పరమ శివుని అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఈ మాసాలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా శివుడిని పూజించాలని చెప్తున్నారు. ఈ మాసంలో ఏక భుక్తం, నేలపై శయనం, బ్రహ్మచర్యం వంటి నియమాలను పాటించి శివుడి కటాక్షాన్ని పొందాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications