కర్మకు సాక్షి ఎవరు ? అవే చర్యలను గమనిస్తాయా ? ఆ 18 సాక్షుల సాక్ష్యమే విధిరాతనా ?
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151
మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు. చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత . కానీ 'నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు' అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .

వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయ. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు. అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే . ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు .












Click it and Unblock the Notifications