కార్తీక మాసం చివరి సోమవారం..ఇలా చేస్తే చాలు కోటి జన్మల పుణ్య ఫలం
పవిత్రమైన కార్తీక మాసం మరికొన్ని రోజుల్లో ముగియనున్న తరుణంలో, ఈ మాసంలో వచ్చే చివరి సోమవారం (నవంబర్ 17) అత్యంత విశేషమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజున భక్తిశ్రద్ధలతో శివుడిని, విష్ణుభగవానుడిని పూజిస్తే, అనేక దోషాల నుంచి విముక్తి లభిస్తుందని, ఈ నెలంతా పూజలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.ఈసారి చివరి సోమవారం (నవంబర్ 17) నాడు త్రయోదశి తిథి కూడా కలిసి రావడంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది.
శివయ్యకు చేయాల్సిన ప్రత్యేక పూజలు
కార్తీక సోమవారం రోజున శివానుగ్రహం పొందడానికి ఈ పూజలు చేయాలి. శివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటి పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలతో పూజించాలి. మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయని అనుకుంటే, సోమవారం రోజున శివుడికి అన్నంతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల అన్ని రకాల సమస్యలు, దోషాలు తొలగిపోతాయి.

అలంకార ప్రియుడైన శ్రీమహావిష్ణువును కూడా కార్తీక సోమవారం రోజున ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి.తులసీ దళాలతో అర్చన చేయడం ఉత్తమం. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, లేదా సత్యనారాయణ వ్రతం ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి వెంటనే ప్రసన్నుడవుతారని పండితులు సూచిస్తున్నారు.
కార్తీక మాసంలో ఉదయం స్నానం, దీపారాధన, ఉసిరి దానం వంటివి చేయలేని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. చివరి కార్తీక సోమవారం (నవంబర్ 17) నాడు ఈ చిన్న ప్రయత్నం చేస్తే చాలు.శివుడు లేదా విష్ణువు ఆలయంలో ప్రత్యేకంగా ఉసిరి దీపం లేదా 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల నెల మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుంది.
గుడిలో ధ్వజస్థంభానికి ఆకాశ దీపం వెలిగించడం లేదా కొత్త కాషాయ జెండాను సమర్పించడం ద్వారా తెలిసి తెలియక చేసిన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ అరుదైన కార్తీక సోమవారాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకొని శివకేశవుల కృపకు పాత్రులు కావాలి.












Click it and Unblock the Notifications