వైసీపీ వాళ్లతో వేదిక పంచుకుంటే వేటేనా? బొండా ఉమాపై సీఎం సీరియస్!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేతల మధ్య తీవ్రస్థాయి విభేదాలు, వ్యక్తిగత పగలు కొత్త సంచలనాలకు దారితీస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు లేదా సంస్మరణ సభలు జరిగినప్పుడు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొనడం, అంతిమ యాత్రలు, దశదిన కర్మల్లో పాల్గొనడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. కానీ, ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక పూర్తిగా మారిపోనుంది. ప్రతిపక్ష వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవడానికి వీల్లేదని అధికార తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠినమైన నిబంధన విధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
శనివారం గుంటూరులో నిర్వహించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఈ కొత్త సంస్కృతికి బీజం వేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన విజయవాడ సెంట్రల్ తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై ఆసీనులయ్యారు. అంతేకాకుండా, రాష్ట్రంలో సుమారు కోటి మందికి పైగా ఉన్న కాపు సామాజిక వర్గంలో ప్రస్తుతం ఒక రకమైన అలజడి మొదలైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. కాపుల హక్కుల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం నీతికి, ప్రాణ త్యాగానికి నిలువుటద్దమని కొనియాడారు.

గత పరిణామాల గుర్తుచేత.. అధికారం కోల్పోవడానికి అదే కారణం!
ఈ వేదికగా బొండా ఉమా గత రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు. 2014లో తాము అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కాపు ఉద్యమం పురుడుపోసుకుందని, రిజర్వేషన్లు, స్కాలర్‌షిప్‌ల కోసం ముద్రగడ రాసిన లేఖలపై చర్చించాలని నాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అయితే సొంత సామాజికవర్గానికే చెందిన కొందరు నేతలు ముద్రగడపై ప్రభుత్వ పెద్దలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే పరిస్థితి చేయిదాటిపోయిందని వ్యాఖ్యానించారు. ముద్రగడ పిలుపుతో గ్రామీణ స్థాయి వరకు కాపులు ఐక్యమయ్యారని, తుని ఘటనలతో పాటు ఆ ఉద్యమ తీవ్రత వల్లే 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందని బొండా ఉమా సంచలన విశ్లేషణ చేశారు.
చంద్రబాబు సీరియస్..
ఎదురుపడితే కనీసం పలకరించుకోలేని రీతిలో ఏపీ రాజకీయాలు తయారైన తరుణంలో.. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దంటూ పార్టీ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ఎమ్మెల్యే బొండా ఉమా ఉల్లంఘించడంపై టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై ఆయన నుంచి తక్షణమే స్పష్టమైన వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ బాధ్యతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. ఒక సంస్మరణ సభ సాక్షిగా చోటుచేసుకున్న ఈ పరిణామాలు అధికార పార్టీలో ఏ మలుపు తిరుగుతాయోనన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications