బ్రహ్మోత్సవాలు ముగిసిన మూడో రోజే.. తిరుమలలో..
కలియుగవైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇటీవలే ముగిశాయి. మొత్తం 5.76 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం 28.94 కోట్ల రూపాయలు హుండీ ద్వారా కానుకల రూపంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. బ్రహ్మోత్సవ రోజుల్లో మొత్తం 21.84 లక్షల అన్నప్రసాదాలను స్వీకరించారు. 2.04 లక్షల మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే.. 33 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.
ఈ బ్రహ్మోత్సవాలు ముగిసిన సరిగ్గా మూడో రోజే.. మరో ఉత్సవం కనుల ముందుకొచ్చింది. పున్నమిని పురస్కరించుకుని తిరుమలలో పౌర్ణమి గరుడసేవను వైభవోపేతంగా నిర్వహించారు టీటీడీ అర్చకులు. శనివారం రాత్రి ఈ వేడుకలను నిర్వహించారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేలాదిమంది భక్తులు, గోవిందుడి నామస్మరణ మధ్య కన్నుల పండువగా సాగిందీ ఉత్సవం.

శ్రీదేవి, భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడవాహనంపై ఊరేగారు. తిరుమల ఆలయం నాలుగు మాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీనివాసుడి దివ్య దర్శనం కోసం భక్తులు సాయంత్రం నుంచే గ్యాలరీలలో వేచి ఉన్నారు. ఊరేగింపు ప్రారంభం కాగానే హారతులు సమర్పించారు. కర్పూర కాంతుల మధ్య తిరుమల వెలిగిపోయింది.
ఆధ్యాత్మికం, పౌరాణికంగానూ తిరుమల గరుడ సేవకు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. హిందూ ధర్మంలో పేర్కొన్న 108 వైష్ణవ దివ్యదేశాలలో ఈ వాహన సేవను మహా ప్రసాదంగా భావిస్తారు. గరుడ వాహనం ద్వారా శ్రీవారు దాసానుదాస ప్రపత్తిని తెలియజేస్తారు. తనపై నిష్కల్మషమైన భక్తిని కురిపించే భక్తులకు తాను ఎల్లప్పుడూ దాసుడనని నిరూపించడానికే భగవంతుడు ఈ రూపంలో భక్త లోకానికి సముచిత సందేశాన్ని అందిస్తారు.
గరుత్మంతుడు కేవలం శ్రీమహావిష్ణువుకు వాహనం మాత్రమే కాదు, జ్ఞానం వైరాగ్యాలకు నిలువెత్తు రూపం. జ్ఞానం, వైరాగ్యం అనే రెండు రెక్కలతో నిరంతరం స్వామివారి సేవలో విహరించే గరుడుడిని దర్శించడం వల్ల మానవాళికి ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునే ఆధ్యాత్మిక సాధకులకు ఈ దర్శనం సకల శుభాలను, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని చేకూరుస్తుందని వేదాలు చెబుతున్నాయి. జీవన ప్రయాణంలో తెలిసి తెలియక చేసే సకల పాపాలకు ఈ గరుడ వాహన దర్శనంతో ప్రాయశ్చిత్తం లభిస్తుందని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.













Click it and Unblock the Notifications
