నిర్జల ఏకాదశి... ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. సంపద వర్షం
నిర్జల ఏకాదశి 2024 ఈ సంవత్సరం జూన్ 18న వస్తుంది. నిర్జల ఏకాదశికి అక్షయ తృతీయ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు ఎవరైతే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అత్యంత నిష్ఠగా పూజిస్తారో వారికి సిరి సంపదలు, సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు. ఈరోజు భూ, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తే అన్ని విషయాలలోనూ కలిసివస్తుందని, కొనుగోలు చేసిన దాని విలువ రెట్టింపు అవుతుందని చెబుతారు.
నిర్జల ఏకాదశి.. పరమ పవిత్రం .. ఎప్పుడంటే
జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు నిర్జల ఏకాదశిగా చెబుతారు. నిర్జల ఏకాదశి మొత్తం 24 ఏకాదశులలో అత్యంత పవిత్రమైనది. నిర్జల ఏకాదశిని పాండవ భీమ ఏకాదశి లేదా పాండవ నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. ఇది జూన్ 17 ఉదయం 4:43 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు జూన్ 18న ఉదయం 6:24వరకు కొనసాగుతుంది. నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 18, మంగళవారం నాడు ఆచరించబడుతుంది.

నేడు ఒక్కరోజు నిష్టతో విష్ణువుని పూజిస్తే కలిగే ఫలితం ఇదే
ఈ ఒక్కరోజు నిష్టతో లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పొడవునా విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించలేకపోయిన వారికి కూడా సంవత్సరమంతా పూజ చేసిన ఫలితం వస్తుందని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున నీరు, ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇది చాలా పవిత్రమైన రోజు కావటంతో ఈ రోజు చేసే పూజలకు తప్పక ఫలితం వస్తుంది.
నిర్జల ఏకాదశి నాడు ఈ నియమాలతో పూజ చెయ్యాలి
నిర్జల ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి విష్ణువుని, లక్ష్మీదేవిని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. విష్ణు పూజలో తులసిని తప్పనిసరిగా పెట్టాలి. విష్ణు పూజలో తులసి లేకుంటే పూజ అసంపూర్ణంగా చేసినట్టు అవుతుంది. విష్ణు భగవానుడుకి పసుపును సమర్పించాలి. ఉపవాసం పాటించి దానధర్మాలు చెయ్యాలి. అప్పుడు మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు.
నిర్జల ఏకాదశి నాడు ఇలా చెయ్యండి.. పుణ్య ఫలం
అంతేకాదు నిర్జల ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవుతుంది. రావి చెట్టుకు పాలు కలిపిన నీళ్లను, ధూప, దీపాలను సమర్పించడం వల్ల సంపద పెరుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీ దేవి కటాక్షం కోసం జల దానం చేసినా, అన్న దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు కుండను దానం చేయడం కూడా నిర్జల ఏకాదశి నాడు శుభప్రదంగా పరిగణించబడుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications