రావి చెట్టుకు కాసిన్ని నీళ్లు పోసినా చాలు..
హిందూ విశ్వాసాల ప్రకారం, రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటే త్రిమూర్తులు కొలువై ఉంటారు. పితృ దేవతలు, పుణ్యక్షేత్రాలు కూడా రావి చెట్టులో నివసిస్తాయని నమ్ముతారు. శ్రీమద్భగవద్గీతలో సైతం శ్రీకృష్ణ భగవానుడు దీని గురించి స్వయంగా ప్రస్తావించారు. రావి చెట్టు వేళ్ళలో విష్ణువు, కాండంలో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో హరి ఉంటాడని పండితులు చెబుతారు. ఈ కారణాల వల్ల భక్తులు రావి చెట్టుకు నిత్యం పూజలు నిర్వహిస్తారు.
రావి చెట్టును పూజించే విధానం: ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన అనంతరం, రావి చెట్టు ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళాలి. ముందుగా ఆలయంలోని గణేశుడు, అనంతరం మూలవిరాట్టును దర్శించుకోవాలి. ఆ తర్వాత రావి చెట్టు పూజను ప్రారంభించాలి. రావి చెట్టు వేర్లలో ఆవు పాలు, నువ్వులు, చందనం కలిపిన పవిత్రమైన నీటిని సమర్పించాలి. జలాభిషేకం చేశాక జంధ్యం, పూల మాలలు, ప్రసాదం, ఇతర పూజా సామాగ్రిని చెట్టుకు అలంకరించాలి. ధూపం, దీపాలు వెలిగించి, ఆసనంపై కూర్చుని లేదా నిలబడి ఈ మంత్రాన్ని జపించాలి.

మంత్రం:
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే, అగ్రత: శివరూపాయ వృక్షరాజాయ తే నమ:
ఆయు: ప్రజాం ధనం ధాన్యం సౌభాగ్యం సర్వసమ్పదమ్, దేహి దేవ మహా వృక్ష త్వామహం శరణం గత:
రావి చెట్టుపై లక్ష్మీదేవి సోదరి దరిద్ర దేవత నివసిస్తుందని ఒక నమ్మకం. అందువల్ల ఆదివారం నాడు రావి చెట్టును పొరపాటున కూడా పూజించకూడదు. అలాగే, శనివారం, ఆదివారం రోజుల్లో రావి చెట్టును నరకడం లేదా నరికించడం చేయకూడదు. ఇంటి ప్రాంగణంలో లేదా గోడల సందులో ఎక్కడైనా రావి మొక్క మొలిస్తే, దానిని జాగ్రత్తగా తొలగించి వేరే ప్రదేశంలో నాటించాలి. ఇది శుభప్రదంగా భావిస్తారు.
రావి చెట్టు పూజతో కొన్ని పరిష్కారాలు: జాతకంలో శని దోషం వంటివి ఉన్నట్లయితే, శనివారం నాడు ప్రత్యేకంగా రావి చెట్టుకు జలం సమర్పించాలి. పిండితో చేసిన నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేసి, అందులో ఆవనూనె, దూదితో చేసిన వత్తి వేసి వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగించి, రావి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. శనివారం నాడు రావి చెట్టు కింద కూర్చుని హనుమాన్ చాలీసాను ఏడు సార్లు పఠించడం వల్ల శత్రువుల భయం తొలగిపోతుంది. రావి చెట్టు కింద శివలింగాన్ని ప్రతిష్టించి ప్రతిరోజూ పూజించడం వల్ల మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నమ్ముతారు.
సాయంత్రం వేళల్లో ఆవనూనెతో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రావి చెట్టును పూజించడం ద్వారా పితృదేవతలు శాంతిస్తారు. శనిదేవుడు ప్రసన్నుడై, జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి.












Click it and Unblock the Notifications