పూరీ జగన్నాథుని ఆలయంలో అంతుచిక్కని రహస్యాలు
12వ శతాబ్దానికి చెందిన పూరీ జగన్నాథుని ఆలయంలోని అంతుచిక్కని రహస్యాలు ఆధునిక సైన్స్ కు సైతం అందడంలేదు. ఇక్కడి గర్భగుడిలో కొలువైన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి విగ్రహాలను మిగతా ఆలయాల్లో ఉన్నట్లుగా రాతితో కాకుండా వేప చెక్కతో తయారు చేయడమే ప్రత్యేకత. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అత్యంత రహస్యంగా, నగరం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిపివేసి పాత విగ్రహాల్లోని గుండెల్లో ఉండే'బ్రహ్మ పదార్థాన్ని' కొత్త విగ్రహాల్లోకి మారుస్తూ 'నవకళేబర ఉత్సవాన్ని' నిర్వహిస్తారు. ఇది మార్చేవారికి మాత్రమే తెలుసు.
గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది
ఈ ఆలయ గోపురంపై ఎగిరే జెండాకు 800 ఏళ్ల నాటి అద్భుతమైన సంప్రదాయం ఉంది. సుమారు 45 అంతస్తుల భవనం ఎత్తు ఉండే ఈ గోపురంపైకి ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో అర్చకులు ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా పాకుతూ వెళ్లి జెండాను మారుస్తారు. ఒక్క రోజు ఈ జెండా మార్చడం ఆపినా.. సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని ఏకంగా 18 ఏళ్ల పాటు మూసివేయాల్సి ఉంటుంది. సాధారణంగా జెండాలు గాలి వీచే దిశలో ఎగురుతుంటే, ఈ జెండా మాత్రం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం ఒక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది.

నీడ కిందే పడదు
ఆలయ నిర్మాణ శైలి, పరిసరాల్లోని ప్రకృతి నియమాలు సైన్స్‌కు సైతం సవాల్ విసురుతున్నాయి. ఈ భారీ ఆలయ ప్రధాన శిఖరం నీడ పగటిపూట ఏ సమయంలోనూ, ఏ వైపునా భూమిపై పడదు. అలాగే ఈ గోపురం పైభాగంలో ఏ పక్షీ వాలదు, దానిపై నుండి విమానాలు కూడా వెళ్లవు. అంతేకాదు, సముద్ర తీరానికి ఆనుకుని ఉండే ఈ గుడి సింహద్వారం వెలుపల సముద్రపు అలల హోరు స్పష్టంగా వినిపిస్తుంది కానీ, లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం పూర్తిగా మాయమైపోతుంది. తీర ప్రాంతాల్లో పగలు, రాత్రి వీచే గాలి దిశలు కూడా ఇక్కడ ప్రకృతి నియమాలకు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి.
ఒక్క మెతుకు కూడా వృథా కాదు
ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలలలో ఒకటైన పూరీ కిచెన్ లో జరిగే ప్రసాద తయారీ మరో విచిత్రం. ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఒకదానిపై ఒకటిగా 7 మట్టి కుండలను పెట్టి మహాప్రసాదాన్ని వండుతారు. మంట కింద ఉన్నప్పటికీ, అందరికంటే పైన 7వ స్థానంలో ఉన్న కుండలోని అన్నం మొదట ఉడకడం ఇక్కడి ప్రత్యేకత. గుడికి రోజువారీ వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉన్నా, లక్షల్లో ఉన్నా ఇక్కడ వండే ప్రసాదం ఒక్క మెతుకు కూడా వృథా కాదు, అలాగని ఎవరికీ తక్కువ కూడా కాదు. ప్రతి ఏటా ఆషాఢ మాసం ప్రారంభంలో 9 రోజులపాటు జరిగే పూరీ జగన్నాథుని రథయాత్రను తిలకించడానికి ప్రపంచదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు.














Click it and Unblock the Notifications