హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్స్ కు తీపికబురు.. వాళ్ళకోసం ప్రత్యేక ఇందిరమ్మ టవర్స్!
హైదరాబాద్‌లోని ఆటో కార్మికులకు సొంత ఇల్లు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటో కార్మికులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.220 కోట్లతో ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నాలుగు ప్రాంతాల్లో ఆటోనగర్ కాలనీలు నిర్మించనున్నారు.
దీనికోసం బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీర్‌బాగ్, జల్ పల్లి లక్ష్మీగూడలను ఎంపిక చేశారు. ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం 2 వేల ఎల్ఐజీ ఫ్లాట్లు నిర్మిస్తారు. ఇవి ఇందిరమ్మ టవర్స్ పథకం కిందనే వస్తాయి. ఇప్పటికే క్యూర్ పరిధిలో అల్పాదాయ కుటుంబాలకు నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌కు వర్తించే విధివిధానాలు, అర్హత నిబంధనలు, కేటాయింపు విధానం ఈ ఆటోనగర్ కాలనీలకు కూడా వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేశారు.

ఆటో కార్మికులు నగరంలో రోజువారీ ప్రయాణ సేవలు అందించే ముఖ్యమైన వర్గం. చాలామంది అద్దె ఇళ్లలో నివసిస్తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంత ఇల్లు లేకపోవడం వల్ల వారి కుటుంబాలు స్థిరత్వం లేకుండా ఉంటున్నాయి. ఈ ప్రత్యేక కాలనీలు వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించి, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి దోహదం చేస్తాయి. ప్రభుత్వం ఇందిరమ్మ పథకం ద్వారా పేద, అల్పాదాయ వర్గాలకు ఇళ్లు కల్పిస్తున్న నేపథ్యంలో ఆటో కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
ఫ్లాట్లు ఎల్ఐజీ కేటగిరీలో ఉండటం వల్ల లబ్ధిదారులు తక్కువ ఖర్చుతో సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా ఇందిరమ్మ టవర్స్‌లో ప్రభుత్వం సబ్సిడీ అందించి, స్థలం ఉచితంగా కేటాయించి, లబ్ధిదారులు నిర్ణీత మొత్తం చెల్లించే విధంగా ఉంటుంది. అర్హత, లాటరీ ద్వారా కేటాయింపు, 360 డిగ్రీల విచారణ వంటి నిబంధనలు ఇక్కడ కూడా అమలవుతాయి. దీనివల్ల పారదర్శకత ఉంటుంది.
నగరంలో ఆటో కార్మికుల సంఖ్య లక్షల్లో ఉంది. వారికి స్థిరమైన నివాసం కల్పించడం వల్ల సామాజిక భద్రత పెరుగుతుంది. కుటుంబాలు మెరుగైన వాతావరణంలో నివసించి, పిల్లల చదువు, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టగలుగుతారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తే వేలాది మంది ఆటో కార్మికుల కల నెరవేరుతుంది. హౌసింగ్ బోర్డు త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆటో కార్మికుల సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.













Click it and Unblock the Notifications
