ఈ ఆలయంలో మీరు ఏం కోరుకున్నా తీరిపోతాయి
సర్వానికి యజమానులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే శక్తిని ప్రసాదిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారు. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నంలో మహేంద్ర తనయ నది సమీపంలో అమ్మవారు వెలిశారు. శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. పర్లాకిమిడి ప్రాంతంలో సంచారం చేస్తున్న గజపతి మహారాజుకు అమ్మవారు కలలో కనిపించారు. తాను ఫలానా ప్రదేశంలో ఉన్నానంటూ ఆనవాళ్లు చెప్పారు. అక్కడికి వెళ్లి వెతకమని అమ్మవారు చెబుతున్న సమయంలోనే పొలం దున్నుతున్న రైతు నాగలికి ఏదో తగిలి ఆగిపోయింది.
వాహన పూజలు ఎక్కువ
వెంటనే ఆ రైతు ఊళ్లో అందరినీ పిలుచుకు వచ్చాడు. అందరూ కలిసి వెలికితీస్తే అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ప్రజలు గజపతి మహారాజుకు తెలియజేయడంతో ఆయన గుడి కట్టించారు. ఇక్కడ వెలిసిన అమ్మవారు కొలిచేవారి కొంగు బంగారంగా మారారు. ఒడిసాకు సరిహద్దులో ఉండటంతోపాటు పర్లాకిమిడి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి నీలమణి దుర్గమ్మను కొలుచుకుంటున్నారు. వాహన పూజలు ఎక్కువగా జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏ కొత్త వాహనం కొనుగోలు చేసినా ఈ గుడి దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవనే ప్రగాఢమైన నమ్మకం ఉంది.

కుంకుమార్చన, విశేష పూజ
ప్రతి మంగళవారం నీలమణిదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఘట్టాలు సమర్పిస్తారు. అమ్మవారికి ఇక్కడ ప్రతిరోజు కుంకుమాభిషేకం జరుగుతుంది. ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి పండగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆ తొమ్మిది రోజులు జరిగే కుంకుమార్చన, విశేష పూజల్లో భక్తులు వేల సంఖ్యలో వచ్చి పాల్గొనడంతోపాటు అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకుంటారు.












Click it and Unblock the Notifications