ఉగాది: తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమటి?

Posted By:
Subscribe to Oneindia Telugu

వర్షలగ్న జగల్లగ్నాలను విచారణ చేయగా - రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా ప్రజోపయోగ పథకాలు అమలు పరుస్తున్నప్పటికిని అధికారుల సమన్వయ లోపము వలన శుభఫలములు అన్నియు ప్రజలకు ఆశించినంతగ అందుబాటులోనికి రావు. అలాగే అకాల విపత్తులను ఎదుర్కొనటంలో ప్రభుత్వ వైఫల్యాల వల్ల సామాన్య ప్రజానీకం ఇక్కట్ల పాలయ్యే సూచనలు ఉన్నాయి.

ద్వితీయ స్థానమును పరిశీలించగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచే విషయంలో ప్రభుత్వము చేయు ప్రయత్నములన్నియు ఇసుకలో బండి లాగుటవంటివే అగును. అలాగే, కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత విపరీత ధోరణులు పెరుగుతాయి. బ్యాంకింగ్ రంగములో ఆరోగ్యవంతమైన పోటీతత్త్వము పెరిగిఖాతాదారులకు తగిన సేవను అందించడంలో బ్యాంకులు సఫలమవుతాయి.

Ugadi: The future of the Telugu states

తృతీయస్థానమును పరిశీలించగా రాష్ట్ర రవాణారంగములో పెను క్లిష్ట సమస్యలు ఎదురవుతున్నప్పటికిని పలు ఆకర్షణీయ ప్రజోపయోగ పథకాలతో ప్రజల మన్ననలు అందుకుంటుంది. అలాగే పత్రికా, సమాచార రంగాలలో వినూత్నమైన సంస్కరణలతో కూడిన మార్పులు వస్తాయి.

చతుర్థస్థానమును పరిశీలించగా రియల్ ఎస్టేటు రంగాలలో ప్రభుత్వ ప్రోత్సాహ, సహకారము కొంత తక్కువగా కనిపించుచున్నవి. వ్యవసాయ రంగములో ప్రకృతి /ఈతిబాధలు పెరిగినను ప్రభుత్వపు ప్రోత్సాహముతో కొంత మేలైన పరిణామములు గోచరించుచున్నవి. విద్యారంగమున ప్రగతి కనిపించుచున్నది. కానీ, విద్యార్థి సంఘములలో కుటిల రాజకీయములు ప్రవేశించి సమాజమునకు సమస్యలు సృష్టించు పరిస్థితి కనిపించుచున్నది.

పంచమ స్థానమును పరిశీలించగా శిశుసంక్షేమం, సంగీత, సాహిత్య పరిశోధనా రంగాలలో ప్రభుత్వ అలసత్వ ధోరణి ఉన్నప్పటికిని ప్రభుత్వేతర సహకారం, ప్రోత్సాహాలతో కాస్త నిలదొక్కుకుంటాయి.

షష్ఠ స్థానమును పరిశీలించగా అన్ని రంగాలలోను ఆరోగ్యకరమైన పోటీకి తగినట్లు అభివృద్ధి కనిపించుచున్నది. భద్రతాదళ, శ్రామిక వ్యవస్థల అభివృద్ధికై నిధులు పెంచవలసివచ్చును. కాగా, రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణ, ప్రజా రక్షణ విషయంలో ప్రభుత్వం సమర్థవంతముగా వ్యవహరించి ప్రజల మన్నను చూడగొంటుంది.

సప్తమ స్థానమును పరిశీలించగా రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా, రాష్ట్ర వాణిజ్య వ్యవహారాలు నిరుడు కంటే కొంత కుంటుబడే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే, రాష్ట్రంలో ఆదర్శ వివాహ వ్యవస్థలు కొంత బలహీనపడుతున్నప్పటికిని కుటుంబ విలువలకు ప్రాధాన్యతల నివ్వటం కొంత శుభసూచకంగా గోచరిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలలో రహస్యములు బయటపడుట ద్వారా ప్రభుత్వం కొంత అప్రతిష్ట పాలు కావలసివచ్చును. అలాగే విచిత్రమైన అంటువ్యాధులు ప్రబలిల్లుట, తద్ద్వారా ప్రజల ఇబ్బందులు, వాటి నియంత్రణ విషయములో ప్రభుత్వ వైఫల్యము బహిర్గతమగును.

నవమ స్థానమును పరిశీలించగా న్యాయవ్యవస్థ కూడా తన గౌరవమును నిలబెట్టుకొనుటలో కొంతవరకు సఫలీకృతమవుతుంది. మత సంబంధ /ఆధ్మాత్మికత విషయాలలో పీఠాధిపతుల, మరాధిపతుల కృషి విశేషంగా ఉండి ఇటు ప్రజలలోను, అటు పాలకులలోను ఆధ్మాత్మికత పెరుగుట, ధర్మానికి కట్టుబడి ఉండే లక్షణములు ఎక్కువగా ఉన్నాయి.

దశమ, ఏకాదశస్థానములను పరిశీలించగా చట్ట విరుద్ధమైన పనులు జరుగుచున్నప్పటికిని, వాటిని సమర్థవంతంగా అడ్డుకోవడంలో ప్రభుత్వము కొంతవరకే సఫలమవుతుంది. ప్రభుత్వరంగ సంసలలో పరస్పర సుహృద్భావ ధోరణలు బాగా పెరుగుతాయి. అలాగే, గ్రామీణ, వ్యవసాయ రంగాలలో మాత్రము సానుకూల సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. రైతులు, ప్రభుత్వము కూడా ఆహారధాన్య విషయములలో శ్రద్ధ వహిస్తారు. వాటి ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగే వివిధ రంగాల ద్వారా రావలసిన ఆదాయం కూడా పెరిగే సూచనలు ఉన్నాయి.

ద్వాదశ స్థానమును పరిశీలించగా రాష్ట్రంలో రాజకీయ ఆందోళనకారులు, అంతర్గత శత్రువులు, విప్లవకారుల దౌర్జన్యాలను అదుపు చేయటంలోను, అరికట్టడంలోను ప్రభుత్వం విజయం సాధిస్తుంది. కాగా, కేంద్ర ప్రభుత్వములోను, రాజకీయ రంగాలలోను పెను మార్పులకు తగిన గ్రహ సన్నివేశములు కనిపించుచున్నవి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer predicts the future of the two Telugu states, Telangana and Andhra Pradesh in Telugu new year.
Please Wait while comments are loading...