తృణమూల్‌లో భిన్నాభిప్రాయాలు
కోల్‌కతా: మళ్లీ ఎన్డిఎలో చేరడంపై తృణమూల్కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తృణమూల్ అధినేత మమతా బెనర్జీ ఎన్‌డిఎ గూట్లో చేరడానికి సుముఖంగా వున్నప్పటికీ పార్టీలోని కొందరు నేతలు మాత్రం విముఖంగా వున్నట్టుగా చెబుతున్నారు. కాగా బిజెపి వైపునుంచి కూడా తృణమూల్‌ను మళ్లీ తమ కూటమిలో చేర్చుకోవడానికి పెద్దగా అభ్యంతరాలు కనిపించడం లేదు.
ఎన్‌డిఎలోని భాగస్వామ్య పక్షాలు ఒప్పుకుంటే తృణమూల్ మళ్లీ ఎన్డిఎలో చేరడానికి తమకే అభ్యంతరం లేదని బిజెపి ప్రతినిధి ప్యారేలాల్ ఖండేల్వాల్ మంగళవారం నాడు ప్రకటించారు. ఈ విషయంలో బిజెపి అభిప్రాయం ఏమిటన్నది ముఖ్యం కాదని, ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల అభిప్రాయానికే తాము విలువనిస్తామని ఆయన వివరించారు. అయితే బిజెపి పశ్చిమబెంగాల్ శాఖ మాత్రం తృణమూల్‌ను తిరిగి ఎన్డిఎలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా చెబుతున్నారు.
కాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వరకు వేచిచూసే ధోరణి అవలంభించడం మంచిదని ఆ తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవాలని తృణమూల్ నేతలు కొందరు మమతకు సలహానిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్‌డిఎ నుంచి హడావుడిగా బయటకు వచ్చి భ్రష్టుపట్టినట్టుగానే ఇప్పుడు హడావుడిగా మళ్లీ ఎన్డిఎలో చేరితే కూడా భ్రష్టుపట్టే ప్రమాదం వున్నదని వారు హెచ్చరిస్తున్నారు. యుపి ఎన్నికల్లో బిజెపి రాణించకపోతే ఎన్‌డిఎ భవిష్యత్తును అది దెబ్బతీస్తుందని వారు అంటున్నారు. కాగా ఢిల్లీలో బిజెపి అగ్రనేతలను కలుసుకుని విస్తృతంగా మంతనాలు జరిపిన మమత తన మనసులో ఏముందో బయటపెట్టకుండా కేవలం ఫీలర్స్తో సరిపెట్టుతుండటం పట్ల బిజెపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
