ఐటి సంస్థల్లో అవినీతి
హైదరాబాద్: టెక్నాలజీ వల్ల పారదర్శకత సాధిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తుంటే ప్రజలు నమ్మవచ్చు. అయితే ఐటి సంస్థల్లోనే వేళ్లూనుకుంటున్న అవినీతి సంగతేమిటని ఐటి పట్టాలతో ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు.
అమెరికా నుంచి తిరిగి వస్తున్న వారి నుంచి పోటీ తీవ్రంగా వుండే ప్రమాదం వుండటంతో ఏదో ఒక ఐటి ఉద్యోగంలో చేరిపోవాలనే ఆతృతలో వున్న స్థానిక క్వాలిఫైడ్ ఐటి ప్రొఫెషనల్స్‌నుంచి కొన్ని ఐటి కంపెనీల్లో హెచ్‌ఆర్‌కు సంబంధించిన వ్యక్తులు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా తెలిసింది. డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇవ్వడం కాకుండా ఇంటర్వ్యూలు, ఇతర పరీక్షలు అన్నీ పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆర్డర్లు చేతిలో పెట్టడానికి కొన్ని చోట్లహెచ్‌ఆర్ ఉద్యోగులు డబ్బులు అడుగుతున్నట్టుగా అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.
గతంలో కూడా కొన్ని పెద్ద పెద్ద ఐటి కంపెనీల్లో ఇలాంటి బాగోతం జరుగుతున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. హెచ్‌ఆర్‌లో సరైన ఛానెల్ వుంటే డబ్బులు పెట్టి ఉద్యోగం సంపాదించుకోవచ్చేనే ప్రచారంతో పాటు ఫలానా కన్సల్టెన్సీకి ఫలానా ఐటి కంపెనీ హెచ్‌ఆర్‌తో బ్రహ్మాండమైన సంబంధాలు వున్నాయనే వార్తులు ప్రచారంలో వుండేవి.
హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ ద్వారా టాప్‌మానేజ్‌మెంట్‌కు ఏ మాత్రం తెలవకుండా ఉద్యోగాల్లో చేరిపోయిన కొందరికి తాము చేయాల్సిన ఉద్యోగం గురించి ఎబిసిడిలు కూడా తెలియకపోవడంతో టీమ్ లీడర్స్, ప్రాజెక్టు లీడర్లు తలపట్టుకు కూచునేవారు. ఈ మధ్య కాలంలో మాత్రం ప్లేస్‌మెంట్ సంస్థల ప్రమేయం లేకుండా కొన్ని సంస్థల్లో హెచ్‌ఆర్ ఉద్యోగులే నేరుగా దుకాణాలు తెరుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో వేలాది రూపాయల జీతంతో మంచి పొజిషన్‌లో చేరినవారికన్నా ఈ రోజు కొన్ని కంపెనీల హెచ్‌ఆర్ మానేజర్లు బ్రహ్మాండమైన ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపణలు వున్నాయి.












Click it and Unblock the Notifications