ప్రియాంకను లాగిపారేసిన పోలీసులు-రాహుల్ అరెస్టు..! ఢిల్లీలో మళ్లీ హైడ్రామా..!
కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు, ఎస్ఐఆర్ లో అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో ఇవాళ వరుసగా రెండో రోజూ ఢిల్లీలో విపక్షాలు తీవ్ర స్ధాయిలో ఆందోళనలు నిర్వహించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి వెళ్తున్న ఇండియా కూటమి ఎంపీలను సెంట్రల్ ఢిల్లీలో భారీ భద్రతా వలయం ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీని (Rahul Gandhi) అదుపులోకి తీసుకుని నిరసన స్థలం నుంచి తీసుకెళ్లగా, ప్రియాంక గాంధీ, ఇతర మహిళా ఎంపీలు జంతర్ మంతర్‌కు వెళ్లే రహదారిపై పడుకోవడంతో వారిని బలవంతంగా లాక్కెళ్లారు. తనను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన మహిళా పోలీసు సిబ్బంది, నిరసన సమయంలో తనను కిందకు తోసి, గీసేశారని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేవలం ఎన్నికల కమిషనర్‌ను కలవాలనుకుంటున్న ఎంపీలతో వీళ్ళు ప్రవర్తించే తీరు ఇది అంటూ ప్రియాంక మండిపడ్డారు. మాతో ప్రవర్తించే తీరు ఇది, ఎంపీలను కొడుతున్నారు. పోలీసులు నా ఒళ్ళంతా గీసేశారు, మమ్మల్ని నేల మీద పడేశారు, ఇప్పుడు మేం ఇక్కడి నుంచి కదలబోము, వాళ్ళ బలగాలను వెనక్కి పోనివ్వండి, అప్పటివరకూ ఇక్కడి నుంచి కదలను అంటూ ప్రియాంక గాంధీ భీష్మించారు.

జనపథ్ నుండి జంతర్ మంతర్ వైపు ప్రతిపక్ష ఎంపీలను తీసుకువెళ్తున్న బస్సులను అశోకా రోడ్డుపై పోలీసులు అడ్డుకోవడంతో ఈ ఈ ఘర్షణ చెలరేగింది. దీంతో విండ్సర్ సర్కిల్ వద్ద రోడ్డు దిగ్బంధనం, నినాదాలు, ధర్నాలు మొదలయ్యాయి. పోలీసులు మొదట రాహుల్ గాంధీని బలవంతంగా దించి, భుజాలపై మోసుకుని ఒక పోలీస్ మినీబస్సులో ఎక్కించారు. అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ఉదయ్ భాను చిబ్ సహా కొందరు కాంగ్రెస్ నాయకులు రాహుల్ ను తీసుకువెళ్తున్న బస్సుపైకి ఎక్కగా, మరో నాయకురాలు ముంతాజ్ పటేల్ దాని బానెట్ పై కూర్చున్నారు. ఆ తర్వాత, రోడ్డుపై పడుకున్న ప్రియాంక గాంధీ, ఇతర మహిళా నాయకులను తొలగించడానికి పెద్ద సంఖ్యలో మహిళా పోలీసు సిబ్బంది రంగంలోకి దిగారు. వారిని కూడా బలవంతంగా లాగేసి, బస్సుల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తీసుకువెళ్లారు.













Click it and Unblock the Notifications
