ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్? వైసీపీ పిటిషన్ పై సుప్రీంలో సర్కార్ కేవియట్ ..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా.. ఇప్పుడు ఎస్ఐఆర్ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించవద్దని కోరుతూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టులోనే పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదలపై టెన్షన్ పెరుగుతోంది. అదే సమయంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
గతంలో హైకోర్టు కొట్టేసిన బీసీ రిజర్వేషన్ల పెంపుపై కూటమి ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై త్వరలో సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. అదే సమయంలో ఎస్ఐఆర్ పూర్తి కాకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దంటూ తాము దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేల్చే రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇందులో వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ పై తమను పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో వైఎస్సార్సీపీ.. ఎస్ఐఆర్ పూర్తి కాకుండానే ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమైందని, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో జనవరిలో ఉన్న డేటానే పరిగణనలోకి తీసుకుందని ఆరోపించింది. దీనిపై హైకోర్టులో సానుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ ఊరట కోసం ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో ప్రభుత్వం కేవియట్ దాఖలు చేయడం ద్వారా ఈ పిటిషన్ లో ప్రతివాదిగా చేరింది. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసులో చేపట్టే విచారణ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. కాబట్టి తమ పిటిషన్ పై వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంను కోరారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలిద్దామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. దీంతో త్వరలోనే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నారు.













Click it and Unblock the Notifications
