సుప్రీంలో బీసీ రిజర్వేషన్ల కేసు-ఢిల్లీలో ఏపీ మంత్రుల పాగా- లాబీయింగ్..!
ఏపీ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను (BC Reservations) గ్రామాల్లో 33.33 శాతం, పట్టణాల్లో 34 శాతానికి పెంచుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ఇప్పటికే కొట్టేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ రిజర్వేషన్ల పెంపు చెల్లదని తీర్పు ఇచ్చింది. దీన్ని సుప్రీంకోర్టులో చంద్రబాబు సర్కార్ సవాల్ చేసింది. త్వరలో ఈ కేసు (BC Reservations Case) విచారణకు రానున్న నేపథ్యంలో ఏపీ మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో పాగా వేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ఈ మేరకు ఇవాళ వారు మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, పార్థసారధి,అనగాని సత్యప్రసాద్ ఢిల్లీలో తెలిపారు. సుప్రీంకోర్టు ద్వారా న్యాయం సాధించేందుకు ప్రభుత్వం పోరాటం చేస్తోందని రామ్మోహన్ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపైరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

బలహీన వర్గాల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తదుపరి న్యాయ పోరాట వ్యూహాలపై చర్చించేందుకు ముగ్గురు మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లతో సమావేశమైన మంత్రుల బృందం, న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టు తీర్పులు వివిధ కమిషన్‌ల రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తు విధివిధానాలపై ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దేవదత్ కామత్ చర్చించినట్లు ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంతో పాటు, వారికి రాజకీయ, ప్రజాస్వామ్య సాధికారత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పార్థసారధి తెలిపారు. బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
