థాకరే ఆగ్రహానికిఅసలు కారణం...
ముంబాయి శివసేన గురువారం నాడు కోర్డినేషన్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించడానికి అసలు కారణం యుటిఐ సంక్షోభం కాదని వెల్లడయింది. మహారాష్ట్రలోని కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు శివసేన వేసిన ఎత్తుకు బిజెపి నాయకత్వం చక్రం అడ్డువేసిందనే ఆగ్రహంతోనే తాము ఎన్‌డిఎ సమావేశానికి దూరంగా వున్నట్టుగా శివసేన నేత బాల్‌థాకరే చెప్పారు.
ఎన్‌డిఎ సమావేశానికి శివసేన గైరాజరుతో బెంబేలెత్తిన ఎన్‌డిఎ నేత జార్జ్ హుటాహుటీన ముంబాయి పరుగెత్తిన విషయం విదితమే. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల వల్లనే మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతకు తాము పన్నిన ఎత్తు చిత్తయినట్టు బాల్‌థాకరే తనను కలసిన జార్జ్‌తో ఆరోపించారు. అందుకే తాను కేంద్ర మంత్రి సురేష్ ప్రభును ఇతర ఎంపీలను ఎన్‌డిఎ సమావేశానికి దూరంగా వుండాల్సిందిగా ఆదేశించినట్టుగా ఆయన వెల్లడించారు.
థాకరే ఆరోపణలతో జార్జ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయారని అయితే థాకరేతో తన ఆయిదు దశాబ్దాల సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించి ఆయన్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. తమ ప్రయత్నాలకు గండికొట్టిందెవరో చెప్పడానికి థాకరే నిరాకరించారని అదేసమయంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని తెలిసింది. తమ పార్టీ ఎంపి నిరుపమ్ సంజయ్ కేవలం ప్రధాని కార్యాలయం పై మాత్రమే ఆరోపణలు చేశారు తప్ప ప్రధాని వాజ్‌పేయి మీద కాదని కూడా ఈ సందర్భంగా థాకరే వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications