చంద్రబాబుకు క్లాస్‌పీకిన తమ్ముళ్ళు!
హైదరాబాద్‌ః తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మపరిశీలనలో పడ్డారు.పేరుకు ఎమ్మెల్ల్యేలమే కానీ ఓ పదవి లేదు... స్థానికంగా పలుకుబడి లేదంటూ తమ్ముళ్ళు నిష్ఠుర సత్యాన్ని సూటిగా చెప్పడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. జిల్లాల్లో అధికార్ల పెత్తనం కొనసాగుతున్నది. ఎమ్మెల్ల్యేలను పట్టించుకొనే నాధుడే లేడు... అటువంటప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా ఎమ్మెల్ల్యేలకు, పార్టీ నేతలకు మంచిపేరు ఎలా వస్తుందని వారు చంద్రబాబుతో నిర్మొహమాటంగా చెప్పారు.
ఇటీవల జరిగిన స్థానిక, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెనుకంజ వేయడానికి, జిల్లాల్లో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు చంద్రబాబు వారంరోజుల పాటు సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సమావేశాల్లో తొలిరోజు కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు.
ప్రభుత్వ పథకాలు, పనితీరుపై నేతలంతా నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని చంద్రబాబుకోరారు. నేతల సూచనలను పరిశీలించి తదనుగుణంగా పార్టీలో, ప్రభుత్వ విధానాలలో మార్పులు తీసుకు వస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.
చంద్రబాబే నిర్మొహమాటంగా మాట్లాడండి అని చెప్పడంతో కోస్తా జిల్లాల నేతలు గళంవిప్పారు. పదవులు లేవు, పెత్తనం లేదు... ప్రజల్లో పలుకుబడి ఎలా పెరుగుతుందని వారు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు చుట్టూపేరుకుపోతున్న కేంద్రీకృత విధానాలను మూడు జిల్లాల నేతలు సవాలు చేశారన్నమాట. ఈవిమర్శలకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో? ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications