హైదరాబాద్‌లో ఎఫ్‌బిఐ అధికారుల ఆరా
హైదరాబాద్: అమెరికాలో దాడుల నేపథ్యంలోఅరెస్టయిన ఇద్దరు హైదరాబాదీల కుటుంబాల గురించి ఆరా తీసేందుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ఎఫ్‌బిఐ అధికారులను రాకను అత్యంత గోప్యంగా వుంచారు. హైదరాబాద్ పాతబస్తీలోని హరిబౌలీలో గల మహ్మద్ జావీద్ అజ్మత్, అయూబ్ అలీఖాన్‌ల ఇళ్లపై పోలీసులు దాడులు చేసినట్లు, వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈవిషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ధృవీకరించడం లేదు.పైగా ఖండిస్తున్నారు.
ఎఫ్‌బిఐ ఏజెంట్లు తమ సహాయం కోరలేదని, ఏ విధమైన దాడులూ నిర్వహించలేదని పోలీసు ఉన్నతాధికారి ఒక్కరు చెప్పారు. ఆ ఇద్దరికి సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఇంతకు ముందు ఎఫ్‌బిఐకి పంపారని, ఈ సమాచారాన్ని తనిఖీ చేసుకోవడానికి, ధృవీకరించుకోవడానికి ఇంటలిజెన్స్ విభాగంతో ఎఫ్‌బిఐ సంప్రదింపులు జరుపుతోందని ఆయన చెప్పారు.
అమెరికా వెళ్లడానికి ఆ ఇద్దరు తప్పుడు డాక్యుమెంట్లతో పాస్‌పోర్టులు పొందినవివరాలను రాష్ట్ర పోలీసులు ఎఫ్‌బిఐ అధికారులకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆ ఇద్దరు తమ తలిదండ్రులకు పంపిన డబ్బులవివరాలను కూడా ఎఫ్‌బిఐ అధికారులకు తెలియజేసినట్లు ఆయన తెలిపారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై, పెంటగాన్‌పై దాడులు జరిగిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఈ ఇద్దరిని అమెరికా అధికారులు అనుమానంతో ఫోర్ట్‌వర్త్‌లోఅరెస్టు చేశారు. ఈ దాడులతో తమ కుమారులకు ఏ విధమైన సంబంధం లేదని వారి తలిదండ్రులు ఇది వరకే చెప్పారు.












Click it and Unblock the Notifications