ఏకంగా నేషనల్ హాలిడే: ఫిఫా నాకౌట్స్ లో ఎంట్రీ: యావత్ దేశం సంబరాలు
ఫిఫా ప్రపంచకప్ లో ఈక్వెడార్ నూతన రికార్డు సృష్టించింది. నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన జర్మనీపై 2-1 గోల్స్ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ అద్భుత ఘనతతో ఈక్వెడార్ జట్టు ఏకంగా 20 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ నాకౌట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తదుదశ రౌండ్ ఆఫ్ 32కు చేరింది. తమ జట్టు ఈ అపూర్వ విజయం సాధించడంతో ఈక్వెడరర్ లో సంబరాలు మిన్నంటాయి.
ఏకంగా ఈక్వెడార్ లో నేషనల్ హాలిడేను ప్రకటించారు. ఈ నెల 27వ తేదీన అంటే శనివారం నాడు ఈక్వెడార్ లో జాతీయ సెలవు దిన అమలులోకి రానుంది. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు డేనియల్ నోబోవా ప్రకటించారు. తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ప్రతిష్ఠాత్మక ఫిఫా వరల్డ్ కప్ లో నాకౌట్స్ లో ప్రవేశించినందుకు ప్లేయర్లు, హెడ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ను అభినందించారు.

టోర్నమెంట్‌లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడితో ఈక్వెడార్ బరిలోకి దిగింది. అంతకుముందు జరిగిన గ్రూప్ దశ మ్యాచులలో ఆ జట్టు ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. ఐవరీ కోస్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలవ్వగా, కురకావుతో జరిగిన తదుపరి పోరు డ్రాగా ముగిసింది. దీంతో మూడో మ్యాచ్‌లో జర్మనీ వంటి పటిష్టమైన జట్టును కచ్చితంగా ఓడించాల్సిన క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. గెలిచి తీరాలనే పట్టుదలతో ఆడిన ఈక్వెడార్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది.
న్యూయార్క్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో రెండో అర్ధభాగంలో జర్మనీ ఆటగాడు లెరాయ్ సనే వివాదాస్పద రీతిలో తొలి గోల్ నమోదు చేశాడు. ఈ మూవ్‌లో జర్మనీకి చెందిన పావ్లోవిక్, ఈక్వెడార్ మిడ్‌ఫీల్డర్ పెడ్రో విటేను అడ్డుకునే క్రమంలో ఫౌల్ చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఈక్వెడార్ ఆటగాళ్లు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ రెఫరీ తోరి పెన్సో ఆ గోల్‌ను సరైనదిగానే ప్రకటించారు. వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం గమనార్హం.
జర్మనీ గోల్ చేయడంతో ఈక్వెడార్ కథ ముగిసిపోయిందని అంతా భావించారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే ఆట స్వరూపం మారిపోయింది. విటే అందించిన పాస్‌ను స్వీకరించిన నిల్సన్ అంగులో, డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ అద్భుతమైన గోల్ ప్రదర్శించి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ 77వ నిమిషంలో కార్నర్ కిక్‌ను కెవిన్ రోడ్రిగ్జ్ హెడర్ ద్వారా మళ్లించగా, దానిని గొంజాల్లో ప్లాటా నేర్పుగా గోల్ పోస్ట్‌కు చేర్చి జట్టును 2-1 ఆధిక్యంలో నిలిపాడు.
గ్రూప్ దశలోనే ఇంటిదారి పడుతుందనుకున్న జట్టు ఊహించని రీతిలో నాకౌట్ చేరడంతో ఈక్వెడార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చారిత్రక విజయంపై అధ్యక్షుడు డేనియల్ నోబోవా భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదురైనప్పటికీ కఠిన పరిస్థితులను తట్టుకుని దేశానికి ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ఆటగాళ్లు, కోచ్‌ను ఆయన అభినందించారు. 27వ తేదీని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications