న్యూఢిల్లీః భారత-పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని వాజ్ పేయి మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, మాజీ ప్రధాన మంత్రులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ప్రధాని మంగళవారం ఏర్పాటు చేసిన విందు సమావేశంలో మాజీ ప్రధానులు వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారాలు, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ లు పాల్గొన్నారు.
భారత పార్లమెంటుపై సెప్టెంబర్ 13న జరిగిన టెర్రరిస్టుల దాడి అనంతరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీసుకున్న దౌత్యపరమైన చర్యల గురించి వాజ్ పేయి వారికి వివరించినట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే అంశాన్ని కూడా వాజ్ పేయి వారితో చర్చించారని తెలుస్తున్నది. భారత పార్లమెంటుపై దాడి జరిగిన తరువాత ఉన్నత స్థాయి వర్గాలతో ప్రధాని వాజ్ పేయి పరంపరగా చర్చలు జరుపుతున్నారు. మూడు రోజుల కిందట ప్రధాని కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్ వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఎఐఎడిఎంకె పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ప్రధాని ఏర్పాటు చేసిన విందు సమావేశంలో హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ తదితరులు పాల్గొన్నారు.