గుంటూరుః కుల నిర్మూలన, పేదలు, బడుగువర్గాల అభ్యున్నతి ప్రధాన ధ్యేయంగా 16వ విడత జన్మభూమి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం మేడికొండూరు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం నాడు ప్రారంభించారు.
గత పదిహేను విడతల జన్మభూమి కార్యక్రమాల్లో సమకూరిన అనుభవం ఆధారంగా ఈ సారి జన్మభూమిని నిర్వహిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. కులనిర్మూలన ఈ రోజు కూడా సమాజాన్ని వేధిస్తుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడుగువర్గాల్లో చైతన్యం కోసం కృషిచేయాల్సిన అవసరం వున్నదని చెప్పారు. తీవ్రవాదులు కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భూములు సాగుకు నోచుకోకుండా వున్నాయని ఆ భూములను ప్రభుత్వమే కొని పేదలకు పంచే ఆలోచనలో వున్నదని ఆయన చెప్పారు. అదే విధంగా సీలింగ్ కింద స్వాధీనం చేసుకున్న భూములను, అటవీశాఖ నుంచి సేకరిస్తున్న భూములను కూడా పేదలకు పంచనున్నట్టుగా ఆయన చెప్పారు. పేదలు, బడుగు వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను ప్రస్తుత జన్మభూమిలో సమీక్షించనున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. కొత్తగా ఏర్పాటయిన గ్రామ సచివాలయాల వల్ల జన్మభూమిని మరింత సమర్ధంగా నిర్వహించడానికి అవకాశం ఏర్పడిందని ఆయన చెప్పారు. జన్మభూమి కార్యక్రమాన్ని ఆరునెలలకోసారి నిర్వహిస్తున్నందున ఈ సారి జన్ముభూమి పదిరోజుల పాటు జరిగుతుందని ఆయన తెలిపారు.