న్యూఢిల్లీః ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి షిమోన్ పిరాస్ వచ్చే వారం భారత్‌లో అయిదు రోజుల పాటు పర్యటించేందుకు వస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదం గురించి కూడా చర్చలు జరుపుతారు.
ఉగ్రవాదంపై భారత్‌పోరుకు మద్దతు తెలపడంతో పాటు మధ్యప్రాచ్యంలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహకారాన్ని కోరే అవకాశం వుంది. గతంలో ఇజ్రాయెల్ ప్రధానిగా కూడా పనిచేసిన పిరాస్ వచ్చే సోమవారం నాడు ఢిల్లీ చేరుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జస్వంత్‌సింగ్‌తో తొలుత చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రధాని వాజ్‌పేయిని కూడా కలుసుకుంటారు. హోం మంత్రి అద్వానీని ఇతర సీనియర్ నేతలను కూడా ఆయన కలిసే అవకాశం వుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ నేత పర్యటనకు విశేషప్రాధాన్యత వుంది. నెహ్రూ కాలంలో నుంచి మధ్య ప్రాచ్యానికి సంబంధించి అరాఫత్‌ను సమర్ధించిన ఇండియా తాజాగా ఇజ్రాయెల్‌తో స్నేహసంబంధాలను పెంచుకుంటున్నది.