దేశం-బిజెపి పొత్తు- భలే గమ్మత్తు!
హైదరాబాద్‌ః మినీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం దాని మిత్రపక్షమైన భారతీయ జనతాపార్టీల మధ్య పొత్తు వ్యవహారం భలే గమ్మత్తుగా సాగుతున్నది. హైదరాబాద్ లో బిజెపి నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డివిజన్లతో సర్దుకుంది. అయితే రాజమండ్రి, హిందూపురం మున్సిపలిటీల్లో బిజెపి తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం తలొగ్గకుండా వుంది.
హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి-టిడిపి ఏ ఏ డివిజన్లలో పోటీ చేయాలనే విషయం బుధవారం సాయంత్రానికి ఖరారైంది. ఇరుపక్షాలు కాస్త అసంతృప్తితోనే డివిజన్లు పంచుకున్నారు. బిజెపి పోటీ చేస్తున్న 45 డివిజన్లను గుర్తించారు. ఈ డివిజన్లలో అభ్యర్థులను గురువారం నాటికల్లా ప్రకటిస్తామని బిజెపి స్పష్టం చేసింది. గడ్డి అన్నారం మున్సిపల్ చైర్మన్ గిరీ తామే దక్కించుకోవాలని బిజెపి పట్టుదలగా వుంది. ఈ వ్యవహారంలో ఇంకా ఒక అంగీకారం కుదరలేదు.
గెలుపు అవకాశాలున్న డివిజన్లను తెలుగుదేశం పార్టీ వుంచుకొని, ముస్లిం మైనారిటీలు అధికంగా వున్న డివిజన్లను తమ ముఖాన కొడుతున్నారని బిజెపి నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వంటి సీనియర్ల జోక్యంతో డివిజన్ల గుర్తింపు పూర్తయింది. తెలుగుదేశం పార్టీ డ్రైవర్ సీటులో వుండడం, కేంద్రంలో వాజ్ పేయి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కొండంత అండగా వున్న దరిమిలా బిజెపి నేతలు ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది.
రాజమండ్రి, అనంతలో ఎడముఖం పెడముఖం
హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ గిరీకి, కౌన్సిలర్ పదవులన్నింటికీ బిజెపి బుధవారం నామినేషన్లు దాఖలు చేసేసింది. గత మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తమను మోసం చేసింది కాబట్టి ఈ సారి అలాంటిది జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఇలా నామినేషన్లు వేసినట్లు బిజెపి నేతలు చెప్పారు. తమకు చైర్మన్ పదవి ఇచ్చి సామరస్య పూర్వకంగా సీట్ల సర్దుబాటు కుదిరితే సరే .... లేకపోతే అన్ని స్థానాలకు పోటీ చేస్తామని బిజెపి నేతలు తేల్చి చెబుతున్నారు.
రాజమండ్రిలో.......
రాజమండ్రిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఒంటెద్దు పోకడ పోతే అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని బిజెపి నేతలు మొండికేస్తున్నారు.












Click it and Unblock the Notifications
