కొల్లాపూర్‌ః కాంగ్రెస్ శాసన సభ్యుడు గిరిజన నాయకుడు రాగ్యానాయక్ హత్య తప్పేనని పీపుల్స్‌వార్ ప్రకటించింది. ఈ మేరకు పీపుల్స్‌వార్ మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి సంతోష్ పేరుతో విలేకరులకు ఒక ప్రకటన అందింది.
రాగ్యానాయక్ హత్యకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా వార్ పేర్కొంది. తమకు రాగ్యానాయక్‌ను చంపాలన్న ఉద్దేశ్యం ఏనాడూ లేదని తమ టార్గెట్‌లో ఆయన ఎప్పుడూ లేరని అయినప్పటికీ శనివారం నాడు మద్దిమడుగులో ఆంజనేయస్వామి ఉత్సవాల్లో తమ కార్యకర్తలు పొరపాటున రాగ్యానాయక్‌ను టార్గెట్ చేశారని వార్ వివరించింది. రాగ్యానాయక్ హత్యకు తాము చింతిస్తున్నామని ఆయన కుటుంబానికి క్షమాపణలు, ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నామని వార్ పేర్కొంది. నక్సలైట్లతో చర్చలకు సిద్ధమని అంటూనే మరోవైపు నక్సలైట్లను పోటో వంటి చట్టాల ద్వారా అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ద్వంద్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. హన్మకొండ పోలీసు స్టేషన్ పేల్చివేత తర్వాత పోలీసులు అమాయకులైన ఉపాధ్యాయుడు, అంబులెన్స్ క్లీనర్, ఆటోడ్రైవర్, విద్యార్ధిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారని ఆయన దుయ్యబట్టారు.