ఖాట్మండూః అవి చారిత్రక క్షణాలు...... యుద్ధ జ్వరంతో ఊగిపోతున్న భారత్ - పాక్ అధినేతలు సార్క్ వేదికపై కరచాలనం చేసుకున్నారు. భారత ప్రధాని వాజ్ పేయి మొదటి నుంచి సార్క్ వేదికపై ముషారఫ్ పట్ల ముభావంగా వున్నారు. సార్క్ వేదిక నుంచి ప్రసంగాన్ని ముగించిన వెంటనే ముషారఫ్ వేదికపై కూర్చున్న నేతలందరికీ కరచాలనం చేస్తూ వాజ్ పేయి ముందుకు వచ్చి చేయి చాచారు. వాజ్ పేయి కూడా మర్యాద పూర్వకంగా లేచి నిలబడి చిరునవ్వుతో కరచాలనం చేశారు.
భారత పార్లమెంటుపై డిసెంబర్ 13న దాడి జరిగిన అనంతరం వాజ్ పేయి - ముషారఫ్ కలుసుకోవడం ఇదే ప్రథమం. ఇరుదేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ముషారఫ్ వాజ్ పేయితో కరచాలనం చేయడం కేవలం ప్రపంచదేశాల మెప్పు పొందేందుకే అనేది నిర్వివాదాంశం. సార్క్ వేదికపై వాజ్ పేయి కి ముషారఫ్ కు మధ్య ఇద్దరు నేతలు ఆసీనులై వున్నారు. ప్రసంగాలు సాగుతున్నంత సేపూ ఇద్దరు నేతలు ఒకరినొకరు కనీసం చూసుకోలేదు. అటువంటిది ముషారఫ్ కేవలం తన ఉదారత్వాన్ని చాటుకొనేందుకే అవసరం లేకపోయినా అందరు నేతలతో కరచాలనం చూసుకుంటూ వాజ్ పేయితో కూడా కరచాలనం చేశారనేది దౌత్యవర్గాల అభిప్రాయం.