పాక్‌లో కాశ్మీర్ జాతీయ కమిటీ
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం నేతృత్వంలో పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జాతీయ కాశ్మీర్ కమిటీని ఏర్పాటు చేశారు. కాశ్మీర్‌లోని తీవ్రవాదం రూపం మార్చే ప్రయత్నంలో భాగంగా ముషారఫ్ ఈ కమిటీని వేసినట్లు భావిస్తున్నారు.
భారత, పాక్‌లు శాంతి సాధనకు అవకాశం ఇవ్వాలని తన నియామకం తర్వాత ఖయ్యూం అన్నారు. కాశ్మీరీల స్వయం నిర్ణయాధికార హక్కు సాధనకు మార్గంగా హింసను తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన అన్నారు. హింసను వ్యతిరేకించడంతో పాటు ఆయన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వాన్ని ప్రశంసించారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రకటించిన కాల్పుల విరమణతో పాటు శాంతి సాధనకు భారత్ తీసుకున్న చర్యలను ఆయన స్వాగతించారు.
కమిటీ తొలి సమావేశం జనవరి 15వ తేదీన జరుగుతుంది. ఆ సమావేశాన్ని ఉద్దేశించి పాకిస్థాన్ అధ్యక్షుడు ముషారఫ్ ప్రసంగిస్తారు. ఈ కమిటీ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకు వెళ్తుందని, ఐక్య రాజ్య సమితి తీర్మానాల మేరకు సమస్య పరిష్కారానికి ప్రపంచాభిప్రాయాన్ని కూడగడుతుందని, కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాల మానవ హక్కుల ఉల్లంఘనపై దృష్టి పెడుతుందని ప్రకటనలో వివరించారు.












Click it and Unblock the Notifications
