వార్ కుట్ర భగ్నం: కాంగ్రెస్ నేతలపై కేసులు
కరీంనగర్: కరీంనగర్ జిల్లా తూర్పు డివిజన్ ప్రాంతంలోని పోలీసులపై, మోడల్ పోలీసు స్టేషన్‌పై దాడి చేయాలన్న పీపుల్స్‌వార్ నక్సలైట్ల వ్యూహం భగ్నమైంది. పీపుల్స్‌వార్‌కు మందుగుండును, ఇతర సామగ్రిని చేరవేస్తున్న నలుగురు కాంగ్రెస్ నాయకులపై కుట్ర కేసు నమోదయింది. శుక్రవారం ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. పెద్ద యెత్తున మందుగుండు సామగ్రిని పట్టుకున్నారు.
మంథని ఏరియా పీపుల్స్‌వార్ కార్యదర్శి శ్రీకాంత్ ఆదేశాల మేరకు చల్లా నారాయణ రెడ్డి బాబర్ ఖాన్‌తో కలిసి గత నవంబర్‌లో హైదరాబాద్‌లోని మదీనా సెంటర్‌లో 200 మంది పీపుల్స్‌వార్ సభ్యులకు సరిపోయే కిట్ బ్యాగులు, టోపీలు, బెల్టులు, స్లింగ్స్‌తో పాటు తుపాకీ క్లీనింగ్ రాడ్స్, 110 జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేసినట్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామారావు కాటారం పోలీసు స్టేషన్‌లో విలేకరులకు చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం- వాటిని బస్సులో కాటారం తరలించి అక్కడి నుంచి ఎవరికీ అనుమానం రాకుండా ఎడ్ల బండిలో ఇబ్రాహీం పల్లికి చేరవేసి మాజీ సర్పంచ్ దబ్బెట రాజేశం ఇంట్లో, ఇతర ప్రాంతాల్లో దాచారు. కాటారం పోలీసు స్టేషన్‌పై దాడి చేసేందుకు తగిన సమాచారమంతా చల్లా నారాయణ రెడ్డి నక్సలైట్లకు అందించాడు.
నక్సలైట్ల ఆదేశం మేరకు మందుగుండును, ఇతర సామగ్రిని చేరే వేసే ప్రయత్నంలో అనూహ్యరీతిలో వ్యవహారమంతా బట్టబయలైంది. ఇబ్రాహీంపల్లిలో బాబర్ ఖాన్‌ను అరెస్టు చేసి ప్రశ్నించగా వివరాలు పోలీసులకు తెలిశాయి. దీంతో వెంటనే ఇబ్రాహీంపల్లి శివార్లలోని గడ్డివాము, అటవీ ప్రాంతంలో వివిధ చోట్ల పోలీసులు గాలింపు జరపగా 20 క్లైమోర్ మైన్స్, మూడు మందుపాతరలు దొరికాయి. 8 ఎం.ఎం. రైఫల్‌కు 1025 తూటాలు, 0.32 రివాల్వర్ తూటాలు 510, ఎస్.ఎఫ్. రైఫిల్ తూటాలు 15,170 దొరికాయి.












Click it and Unblock the Notifications
